నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Mar 25 2026 7:13 AM | Updated on Mar 25 2026 7:13 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘హంద్రీ–నీవా ద్వారా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఎనిమిది నెలల్లో 52 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తీసుకొచ్చాం, ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 43 టీఎంసీలు చేరినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు ఎంత నీరు తీసుకెళ్లారో, చెరువులకు ఎంత నింపారో, భూగర్భజలాలకు ఎంత చేరిందో స్పష్టంగా వెల్లడించాలి. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా ద్వారా కుప్పం ప్రాంతానికి నీరు తీసుకెళ్లేందుకు రూ.3,850 కోట్లతో కాలువకు లైనింగ్‌ చేశారన్నారు. లైనింగ్‌ పనుల వల్ల రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. లైనింగ్‌ పనుల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందన్నారు. ఈ నిధులతో గాలేరు–నగరి నుంచి చిత్తూరు జిల్లాకు హంద్రీ–నీవా నీటిని తీసుకెళ్లే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పూర్తి చేసి ఉండొచ్చన్నారు. ఫేజ్‌–2లో 4 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చని తెలిపారు.

పేరూరు డ్యాంకు

ఒక్క టీఎంసీ కూడా ఇవ్వలేదేం?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు 52 టీఎంసీల నీరు తెచ్చామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్క టీఎంసీ కూడా పేరూరు డ్యాంకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. డ్యాంను నీటితో నింపే విషయంలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబుకు ఏమాత్రమూ చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. ఇసుకను అమ్ముకోవాలనే స్వార్థంతో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా చేశారన్నారు. పెన్నానది నుంచి రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక తరలించేస్తున్నారన్నారు. ఇసుక తవ్వకాల ద్వారా పరిటాల సునీత దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర దోపిడీ చేశారని ఆరోపించారు. 2002కు ముందు ఉన్న కరువు పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని, రైతులు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 110 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పీఏబీఆర్‌ నుంచి రూ.90 కోట్లతో ప్రారంభించిన పనులు నిలిచిపోయాయన్నారు. గ్రామాల్లో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కుతున్నారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి రామగిరి, సీకేపల్లి మండలాలకు నీరు అందించే పథకం కూడా నిలిచిపోయిందన్నారు. కేవలం కమీషన్ల కోసమే పనులు నిలిపేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, బండి పవన్‌, మీనుగ నాగరాజు, సాకే వెంకటేశు, ఆకుల మునిశంకరయ్య, గుగ్గిళ్ల ప్రసాద్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, చిరంజీవి, విశ్వనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement