వైభవం.. గావుల మహోత్సవం
కనగానపల్లి: ఒకవైపు ఉరుముల శబ్దాలు, మరోవైపు భక్తుల కోలాహలం మధ్య పోతలయ్యస్వామి గావుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం వేకువజామునే భక్తులు బోనాలు ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి సమర్పించారు. తొమ్మిది మంది పోతురాజులు విన్యాసాలు చేసుకొంటూ ఆలయంలోకి వచ్చి పోతలయ్యస్వామికి గావులు పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మేకపోతు పిల్లలను పోతురాజులు స్వామివారికి బలి ఇచ్చి రక్తతర్పణం గావించారు. గావుల మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ఆవరణం జనంతో నిండిపోయింది. భక్తులు ఆలయం ముందు వందలాది పొట్టేళ్లు, మేకపోతులను పోతలయ్యస్వామికి బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని కానుకలు, నారికేళాలు సమర్పించారు.
సందడే.. సందడి
భక్తులతో పోతలయ్యస్వామి జాతర కళ సంతరించుకుంది. పరుష సందర్భంగా గ్రామంలో పెద్ద సంఖ్యలో మిఠాయి, గాజులు, బొమ్మల దుకాణాలు ఏర్పాటయ్యాయి. కొనుగోలుదారులతో దాదులూరు పరుష సందడిగా కనిపించింది. మూడు రోజుల పాటు జరిగిన పోతలయ్య స్వామి జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు తీసుకొన్న పోలీసులు, సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ, పంచాయతీ సిబ్బందికి ఆలయ ధర్మకర్త రామలింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పోతలయ్యస్వామి దర్శనానికి
పోటెత్తిన భక్తులు
కిటకిటలాడిన దాదులూరు
వైభవం.. గావుల మహోత్సవం


