అరటి ఎగుమతికి సహకారం
అనంతపురం అర్బన్: ‘రైలు ద్వారా అరటి ఎగుమతికి తగిన సహకారం అందిస్తామని ఎగుమతిదారులకు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అరటి ఎగుమతిపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉద్యాన శాఖ అధికారులు, ఎగుమతిదారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు ద్వారా తాడిపత్రి నుంచి జేఎన్‌పీటీ పోర్టుకు అరటి ఎగుమతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. రిఫర్ కంటైనర్‌కు రూ.10 వేలు ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎగుమతిదారులు రవాణా ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఇన్సెంటివ్ విషయంపై ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడామన్నారు. అరటి ఎగుమతి ఒకసారి విజయవంతం అయితే దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. అరటి నాణ్యత పెంచేందుకూ చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని గ్రామాల్లోనూ రైతులకు సంబంధిత అధికారుల ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఎగుమతిదారులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ తెలుసుకున్నారు. రైలు ద్వారా అరటి రవాణాలో పరిష్కరించాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో ఉద్యాన శాఖ డీడీ ఉమాదేవి, ఇతర అధికారులు, ఎగుమతిదారులు, వాటాదారులు పాల్గొన్నారు.


