వేంకటరమణ గోవిందా.. గోవింద
● వైభవంగా కొండమీదరాయుని బ్రహ్మ రథోత్సవం
బుక్కరాయసముద్రం: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొండమీదరాయుని బ్రహ్మ రథోత్సవం ఆదివారం బుక్కరాయసముద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున స్థానిక లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో అర్చకులు కొండమీదరాయునికి, శ్రీదేవి, భూదేవికి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ఆలయం నుంచి దేవేరులతో శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి పుర వీధుల గుండా ఊరేగించి రథంపై చేర్చారు. రథం ముందు పండితులు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అశేష భక్త జనసందోహం నడుమ కొండమీదరాయుని బ్రహ్మ రథోత్సవం ప్రారంభమైంది. భక్తులు రథం లాగేందుకు పోటీపడ్డారు. కల్యాణోత్సవం.. బ్రహ్మ రథోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి.. తరించారు.
అశేష భక్త జనసందోహం నడుమ సాగుతున్న కొండమీదరాయుని బ్రహ్మరథోత్సవం


