ప్రశ్నించినందుకే అంబటిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించినందుకే అంబటిపై హత్యాయత్నం

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

ప్రశ్నించినందుకే  అంబటిపై హత్యాయత్నం

ప్రశ్నించినందుకే అంబటిపై హత్యాయత్నం

ఖండించిన వైఎస్సార్‌సీపీ

జిల్లా అధ్యక్షుడు అనంత

గుంతకల్లుటౌన్‌: చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గుంతకల్లులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంత మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతుకొవ్వు లేదని సీబీఐ సిట్‌ నిజాల్ని నిగ్గుతేల్చిన నేపథ్యంలో ప్రజలు ఛీకొడతారనే భయంతో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న సీఎం చంద్రబాబు అండ్‌ కో డైవర్షన్‌ డ్రామాలకు తెరలేపిందని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే అంబటిపై దాడి జరిగినా అడ్డుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మాజీ హోంమంత్రి సుచరిత, ఇతర పార్టీ నేతలకు పోలీసు అధికారులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడమేంటని నిలదీశారు. ఇటీవల మాజీ ఆరోగ్యమంత్రి విడదల రజిని, హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని తగలబెట్టడం చూస్తే రాష్ట్రంలో రాక్షస పాలనసాగుతోందని దుయ్యబట్టారు. ఈ ఘటనపై కేంద్రం, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

రెడ్‌బుక్‌ను.. బ్లడ్‌ బుక్‌గా మార్చేశారు..

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలకు, కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా నిలుస్తున్న రెడ్‌బుక్‌ ఇప్పుడు బ్లడ్‌బుక్‌గా రూపాంతరం చెంది రక్తచరిత్రను రాస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఇందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నమే నిదర్శనమన్నారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని చెప్పిన చంద్రబాబు.. సీబీఐ సిట్‌ నివేదిక వచ్చిన తరువాత జంతుకొవ్వు కాదు.. కల్తీ నెయ్యి అంటూ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ వేయించిన ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్‌ చేసిన మాజీ మంత్రి అంబటిపై హత్యాయత్నానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం హింసా రాజకీయాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. అంబటిపై జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు నరేష్‌కుమార్‌, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి కూడా ఖండించారు.

జిల్లా అంతటా 30 పోలీస్‌ యాక్ట్‌

అనంతపురం సెంట్రల్‌ : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు 30 పోలీస్‌ యాక్టు అమల్లో ఉంటుందని ఎస్పీ పి.జగదీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలు ఉన్నందున శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చునన్న ఉద్దేశంతో పోలీస్‌ యాక్టు అమల్లోకి తెచ్చామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement