హామీలు అమలు చేయలేక దాడులా?
అనంతపురం: హామీలపై ఎక్కడ ప్రజలు తనను నిలదీస్తారోనన్న భయంతో రాష్ట్రంలో విడతల వారీగా డైవర్షన్ పాలిటిక్స్‌కు సీఎం చంద్రబాబు తెరలేపారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ చేసిన ఆరోపణలు నిర్వీర్యం కావడంతో.. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక అల్లర్లు సృష్టించి పెడతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్‌సీపీ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారాలు సాగిచండమే కాక, పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. నేడు మాటమార్చి కల్తీ జరిగిదంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రెస్‌మీట్‌లు పెట్టి చెబుతున్నారని మండిపడ్డారు. అయితే తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ సిట్ బృందం తేల్చి చెప్పిందని, అయినా కల్తీ పేరుతో ప్రజలను పెడతోవ పట్టించేలా ఫ్లెక్సీ రాజకీయానికి తెరలేపారన్నారు. వీటిని తొలగించాలని సూచించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి తెగబడడం దారుణమన్నారు. గతంలో వంగవీటి రంగా ను హత్య చేశారు. మొన్న ముద్రగడ పద్మనాభంపై.. ఈ రోజు అంబటి రాంబాబుపై చూస్తేంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను టీడీపీ నేతలు టార్గెట్ చేసినట్లుగా స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గమనించి తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తరఫున కోరనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్


