రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... గుమ్మఘట్ట మండలం బేలోడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కుమారరెడ్డి (40) శనివారం కళ్యాణదుర్గం పట్టణానికి బైకులో బయలుదేరారు. అదే సమయంలో కళ్యాణదుర్గం మండలం ఇట్లంపల్లికి చెందిన అశోక్, ముక్కన్నలు కళ్యాణదుర్గం నుంచి ద్విచక్రవాహనంలో తిరిగి వెళ్తుండగా, మార్గమధ్యంలో గూబనపల్లి గ్రామం వద్ద ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమారరెడ్డి అశోక్, ముక్కన్నను కుటుంబీకులు తొలుత కళ్యాణదుర్గం సీహెచ్‌సీకి, అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స ఫలించక కుమారరెడ్డి మృతి చెందారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు కుమారరెడ్డికి భార్య సుష్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. కుమారరెడ్డి మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి సంతాపం తెలిపారు.


