గూడుకట్టుకున్న నిర్లక్ష్యం
పేదల సొంతింటి కల... కలగానే మారుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. సకాలంలో బిల్లులు మంజూరు కాక కొందరు.. అధికారుల వేధింపులతో మరికొందరు లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నవారు ఆయా ప్రాంతాల్లో కనీస వసతులు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు.
రాయదుర్గంటౌన్: పక్కా ఇళ్ల నిర్మాణం రాయదుర్గం పురపాలక సంఘంలో నత్తనడనక సాగుతోంది. జగనన్న కాలనీలను అసలు పట్టించుకునేవారే కరువయ్యారు. వసతులు లేక, సకాలంలో బిల్లులు మంజూరు కాక నిర్మాణాలు పడకేశాయి. నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, ప్రభుత్వ సాయం చాలక ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు ఇల్లు కట్టుకుంటావా? పట్టా రద్దు చేయాలా? అని అధికారుల వేధింపులతో పట్టాలు పొంది పునాదులు, బేస్‌మట్టాలు వేసుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి దాకా ఎటువంటి నిర్మాణాలు చేసుకుని వారికి పలుదఫాలుగా నోటీసులు ఇచ్చి విచారణ జరిపించారు. వాటిని ఇతరులకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఖాళీ స్థలాలు కబ్జాలకు గురవుతుండటంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
3,996 మందికి ప్లాట్లు
రాయదుర్గం పురపాలక సంఘంలోని 18 సచివాలయాల పరిధిలో గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 9 జగనన్న లేఅవుట్లు వేశారు. అందులో 3,966 మందికి ప్లాట్లు కేటాయించి నిర్మాణాలు ప్రారంభించారు. ప్రస్తుతం వీటిలో 2,553 మంది నిర్మాణాలు పూర్తి చేసుకోగా 1198 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంటి నిర్మాణ యూనిట్ రూ.1.80 లక్షలు కాగా బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.70 వేలు అదనంగా సాయాన్ని ప్రకటించారు. వాటిలో 325 మంది లబ్ధిదారులకు సొంత స్థలాల్లో రుణాలు మంజూరు కాగా వారికి కూడా సక్రమంగా బిల్లులు మంజూరు కావడం లేదు.
పెరిగిన ధరలు.. ఇబ్బందుల్లో లబ్ధిదారులు
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సిమెంట్, ఐరన్, ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రి ధరలు అమాంతం పెరిగిపోవడంతో రూ.5 లక్షలు ఉన్నా ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఆశించిన మేర అమలు కాకపోవడంతో పేదల దగ్గర డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే... కొన్ని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు లేక కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా నీటి వసతి లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది. మత్తరాసి జగనన్న లేవుట్‌లో ఏమాత్రం వసతులు లేవు. కంపచెట్లు పెరిగి లేఅవుట్ కనిపించకుండా పోయింది. బీటీపీ లేఅవుట్ సర్వే నంబర్ 435, 436 జగనన్న లేఅవుట్లు, కొత్త గౌడ జగనన్న లేఅవుట్‌లో నీటి వసతితో పాటు, కరెంటు సమస్య వేధిస్తోంది. మరోవైపు త్వరిగతిన ఇళ్లను నిర్మించుకోవాలని హౌసింగ్ అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది లబ్ధిదారులుముందుకు రావడం లేదు.
కొత్తవాటి ఊసేదీ?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వాటి కంటే అధికంగా ఇళ్లను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఊదరగొట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా నేటికీ ఒక్క ఇంటికి కూడా పునాది వేయలేదు. కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులు తీసుకుని చేతులు దులుపుకున్నారు.
జగనన్న కాలనీలపై
చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను
సకాలంలో
బిల్లులు మంజూరుకాక అవస్థలు
నిర్మాణ వ్యయం పెరగడంతో లబ్ధిదారుల ఇబ్బందులు
ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కల్పననూ పట్టించుకోని వైనం
గూడుకట్టుకున్న నిర్లక్ష్యం


