పాడి ఉత్పత్తుల పరిశ్రమలకు రాయితీలు
● పశుశాఖ జేడీ డాక్టర్ ప్రేమ్‌చంద్ వెల్లడి
అనంతపురం అగ్రికల్చర్: ఆహారశుద్ధికి సంబంధించి చిన్నపాటి పాడి ఉత్పత్తుల తయారీ కుటీర పరిశ్రమలు, డెయిరీ ఫారాల ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణాలను మంజూరు చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న ఔత్సాహిక పాడి రైతులు, మహిళా సంఘాలు, ఎంటర్‌ప్రెన్యూర్స్.. ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ) కింద దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్వయం సమృద్ధితో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.ప్రాజెక్టు విలువలో 10 శాతం లబ్ధిదారులు భరిస్తే...35 శాతం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద రాయితీ కల్పిస్తుందన్నారు. మిగిలిన 55 శాతంబ్యాంకుల ద్వారా రుణసదుపాయం ఉంటుందన్నారు. గరిష్టంగా రూ.10 లక్షల వరకు రాయితీ వర్తిస్తుందన్నారు. వేరుశనగ నూనె, చిక్కీలు, సోలార్ డీహైడ్రేషన్, పొటాటో చిప్స్, చెక్కిలాలు, ఊరగాయలు, రోటీ మేకర్, మసాలా పొడులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్, శనగపప్పు, బేకరీ ఉత్పత్తులు, జెల్లీ, సాస్, మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు, బొరుగులు, రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్, చింతపండు తదితర మరో 20 నుంచి 30 రకాల ఉత్పత్తుల తయారీకి రాయితీలు వర్తిస్తాయన్నారు. ఇందులోనే పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, కోవా తదితర పాడి అనుబంధ ఉత్పత్తుల యూనిట్లకూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా ఈఓ డి.ఉమాదేవి (79950 86792), రీసోర్స్ పర్సన్ బి.హరీష్ (96767 96974), పశుశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ (99899 32894)ను సంప్రదించాలని కోరారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఆత్మకూరు: ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని నందిని (18) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నందిని విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 23న స్వగ్రామమైన కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురంకు వచ్చింది. తాను ఎక్కువగా చదువుకున్నది , ఉన్నది తలుపూరులో అవడంతో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటానంటూ ఈ నెల 28న తలుపూరుకు వచ్చింది. 29న తండ్రి నాగరాజు కళాశాలలో వదిలివస్తాను బయలుదేరు అని చెప్పాడు. రేపు వెళ్తామని చెప్పి ఫోన్ పెట్టేసింది. శుక్రవారం ఉదయం కూడా నాగరాజు ఫోన్ చేసి కళాశాలకు వెళ్దాం బయలుదేరు అని చెప్పాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు చూసి తల్లిదండ్రులు నాగరాజు, మల్లీశ్వరికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నందినికి అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని వారు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నందిని (ఫైల్)


