రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేద్దాం
● ఎస్పీ జగదీష్ పిలుపు
అనంతపురం సెంట్రల్: రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేద్దామని ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. శుక్రవారం టవర్‌క్లాక్ సర్కిల్‌లో రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కలిగేలా ప్లాష్‌మాబ్‌తో చిన్నారుల ఆటపాటలతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఒక్క క్షణంలో కుటుంబాలు అంధకారంలోకి వెళ్తాయన్నారు. ప్రాణాలు పోయిన తర్వాత పశ్చాత్తాపం పడినా ఉపయోగం లేదని, ప్రమాదాలు జరగకముందే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం మంచిది కాదని, హెల్మెట్, సీటు బెల్టు వినియోగించడం తప్పనిసరి కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విని మణిదీప్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు వెంకటేష్‌నాయక్, జాకిర్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, రాజేంద్రనాథ్‌యాదవ్, జగదీష్, డిస్కవర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
అనంతపురం క్రైం: ప్రమాదాలకు తావివ్వకుండా అత్యంత జాగ్రత్తతో వాహనాలను నడిపే వారిలో ఆర్టీసీ డ్రైవర్లు ముందువరుసలో ఉంటారని ఎస్పీ పి.జగదీష్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ బస్టాండు ఆవరణంలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఎస్పీతో పాటు జిల్లా ప్రజా రవాణా అధికారి కే.శ్రీలక్ష్మి, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ పి. రమేష్ బాబు, ఎం.వి.ఐ జె. సునీల్ కుమార్ హాజరై మాట్లాడారు. జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ల అప్రమత్తతో గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న గుడ్ సమారిటన్ పథకం ద్వారా గోల్డెన్ అవర్‌లో రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడిన వారికి రూ.5 వేలు అవార్డు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో అనంతపురం డిపో మేనేజర్ బి.మురళీధర్, యూనియన్ నాయకులు , ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.


