తహసీల్దార్ కార్యాలయమా.. టీడీపీ ఆఫీసా?
విడపనకల్లు: తహసీల్దార్ కార్యాలయంలో కేవలం టీడీపీ నాయకులు చెప్పిన వాళ్లకే పనులు చేస్తారా .. మిగతా ప్రజలకు ఇక్కడ పనులు జరగవా.. ఇది తహసీల్దార్ కార్యాలయమా? లేకపోతే టీడీపీ ఆఫీసా చెప్పండి ’ అంటూ ముస్లింలు చిన్నవలీసాబ్, పెద్దవలీ సాబ్, షేక్‌లాలుబీ, షేక్ రుబియా,షేక్ జానుబీ, ఫర్వీన్ తదితరులు డిప్యూటీ తహసీల్దార్ చంద్రమోహన్‌ను నిలదీశారు. పచ్చ అంగీలు తొడుక్కోండి.. అసలు ఇటువైపు కన్నెత్తి చూడమని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని వి.కొత్తకోటకు చెందిన ముస్లింలు తమ పితరుల ఆస్తిని తాము అమ్ముకునేందుకు కూడా వీలు లేదా అని ప్రశ్నించారు. సర్వేనెంబర్ 703లో తమకు 6 ఎకరాల భూమి ఉందని వన్‌బీ, ఆర్‌సీ, ఆర్‌హెచ్, రిజిస్టర్ పత్రాలతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌కు చూపించారు. గతంలో తహసీల్దార్‌గా పని చేసి వెళ్లిన శంకరయ్య కూడా సర్వే చేయించి ఇచ్చిన స్కెచ్‌ను కూడా డిప్యూటీ తహసీల్దార్‌కు చూపించారు. ఆరు ఎకరాల స్థలంపై కొందరు టీడీపీ నాయకుల కన్ను పడిందని, సెంటు రూ.5 వేల ప్రకారం తమకు అమ్మాలని బెదిరిస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీటీ డాక్యుమెంట్లను పరిశీలించారు. అభ్యంతరం చెబుతున్న వారి వద్ద రికార్డులే లేకపోతే న్యాయం చేస్తామన్నారు.


