భూసార పరీక్షలు పూర్తి చేయండి
అనంతపురం అగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాల్లో మార్చి నెలాఖరులోపు 23,711 మట్టి నమూనాలు సేకరించి విశ్లేషించాలని వ్యవసాయశాఖ జేడీ ముదిగల్లు రవి, నాచురల్ ఫార్మింగ్ ఛీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అధికారి (సీటీఐఓ) లక్ష్మానాయక్ సూచించారు. ఈ అంశంపై శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏఓ బాలానాయక్‌తో కలిసి ఏఓ, ఏడీఏలు, అలాగే నాచురల్ ఫార్మింగ్ విభాగం సిబ్బందితో వెబెక్స్ నిర్వహించారు. ప్రకృతి సేద్యం విధానాలు విస్తరించాలనే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో సేంద్రియ పద్ధతులు, గో ఆధారిత ఉత్పత్తుల ద్వారా పంటల సాగుకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఆధార్ అనుసంధానంతో రైతు రిజిష్ట్రేషన్లు (ఏఎఫ్‌టీఆర్) పూర్తి చేయాలని, 45 శాతం పూర్తయిన రబీ ఈ–క్రాప్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఫిబ్రవరి నెలాఖరులోపు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
1న కడపలో రాష్ట్రస్థాయి సదస్సు
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారం, న్యాయమైన హక్కుల సాధనకు ఏపీ ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న కడప నగరం వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ కె.చెన్నకేశవులు, ఎ.ఆదికేశవయ్య, వై.మహేశ్వరరెడ్డి, డి.గోవిందరాజులు, కె.మారుతి, హనుమంతు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు సదస్సుకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హామీల అమలు కోసం
ఉద్యమం తీవ్రతరం
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై అనేక హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి రాగానే ఉద్యోగులను విస్మరించారని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిల వివరాలు పే స్లిప్‌లో తెలిపి వెంటనే చెల్లించాలి, సీపీఎస్ రద్దుచేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్టీయూ నాయకులు అనంతపురం, రాప్తాడు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో శుక్రవారం వినతిపత్రాలు అందజేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ మునిసిపల్ విభాగం రాష్ట్ర కన్వీనర్ ఫణిభూషణ్ పాల్గొన్నారు.
విభజన హామీలను
అమలు చేయాలి
అనంతపురం టవర్‌క్లాక్: రాష్ట్ర పునర్నిర్మాణానికి విభజన హామీలు అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ రమణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన హామీలు అమలుకు బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి చట్టం 2005ను యథావిధిగా అమలు పర్చాలన్నారు. హంద్రీ–నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను యుద్ధ ప్రాదిపాదికనపై పూర్తి చేసి నికర జలాలు కేటాయించాలన్నారు.
22 బోరుబావుల వద్ద కేబుల్ చోరీ
పుట్లూరు: ఒకటి కాదు...రెండు కాదు...ఒకే రోజు 22 బోరుబావుల వద్ద కేబుల్ వైర్ల చోరీ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మండలంలోని చెర్లోపల్లి, దోశలేడు గ్రామాల సమీపంలో ఉన్న పండ్లతోటల్లో ఈ చోరీలు జరిగినట్లు శుక్రవారం పోలీసులకు రైతులు ఫిర్యాదులు చేశారు. అరకొర వర్షాలతో పండ్ల తోటలకు, పంటలకు నీరు అందించడానికి ఇబ్బందులు పడుతున్న రైతులు కేబుల్ చోరీలతో బెంబేలెత్తిపోతున్నారు. కొంత కాలంగా చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, కేబుల్‌లో ఉన్న విలువైన కాపర్ కోసం చోరీలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. మీటర్ కేబుల్ రూ.400 నుంచి రూ.500 వరకు ఉందని, అలాంటి వైరును రాత్రి సమయాల్లో కత్తిరించి దోచుకెళ్లడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా చోరీలు జరిగిన ప్రదేశాలను సీఐ సత్యబాబు, ఎస్‌ఐ సురేంద్రబాబు పరిశీలించారు.
భూసార పరీక్షలు పూర్తి చేయండి


