ప్రజల చెవుల్లో పూలు పెడుతున్న బాబు
● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్‌రెడ్డి ధ్వజం
అనంతపురం ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి పూర్తి చేసి ఉంటే ప్రభుత్వానికి రూ.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని చంద్రబాబు అంటున్నారన్నారు. అయితే..రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి సీఎం అయిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి భూముల సేకరణకు రూ.20 వేల కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.50 వేల కోట్లు కలిపి మొత్తం రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు రూ.14 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. గజం రూ.లక్ష పోతుందని, ఎకరానికి రూ.28 కోట్లు ఆదాయం వస్తుందని చంద్రబాబు చెబుతున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా 28 గ్రామాల్లో భూస్వాములు, భూములు కొన్న చంద్రబాబు, ఆయన బంధువులకు మాత్రమే ఆదాయం వచ్చేలా చూసుకున్నారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు భూములు కొనుగోలు చేసి ఉంటే రూ.14 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. అమరావతి నుంచి వచ్చే ప్రతి రూపాయి ఆదాయం రాష్ట్ర ప్రజలకు చెందాలనేది జగన్ ఆలోచన అన్నారు. ప్రభుత్వ భూములను సేకరించి రాజధాని నిర్మించాలని ఆయన చెప్పారన్నారు. రాజధానికి ఏరోజూ వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పారన్నారు. అయితే..ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకురావడం వెనుక రూ.లక్షల కోట్ల దోపిడీ కుట్ర ఉందని, చంద్రబాబు తలపెట్టిన దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమని జగన్ చెప్పారని వివరించారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చారని, ఇదీ పేదల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంపై దుష్ప్రచారం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను టీడీపీ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుందని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. ఇది వైఎస్ జగన్ కొత్తగా తీసుకొచ్చింది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాల్లోనూ అమలు చేయగా వచ్చినదేనని వివరించారు. ఇందులో భాగంగానే సమగ్ర భూ రీసర్వే చేపట్టారన్నారు. దీన్ని బాగా అమలు చేసినందుకు రాష్ట్రానికి దాదాపు రూ.400 కోట్లు మంజూరైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తోందని, అప్పట్లో ప్రకటించిన రూ.400 కోట్ల ఇన్సెంటివ్ ఇప్పుడు రాష్ట్రానికి విడుదలైందని తెలిపారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరగకపోయినా.. జరిగినట్లు దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీమ ప్రజలకు తీరని ద్రోహం
నీటి విషయంలో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. గోదావరి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా సోమశిల ప్రాజెక్టుకు నీళ్లిచ్చేందుకు డీపీఆర్ సిద్ధం చేసి 2019లో చంద్రబాబు పనులు ప్రారంభించారన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు కూడా అప్పుడే డీపీఆర్ చేసినా పనుల గురించి పట్టించుకోలేదన్నారు. గుండ్రేవుల ద్వారా రాయలసీమ ప్రజలు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతోనే నిర్లక్ష్యం చేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తుంగభద్ర హైలెవల్, లోలెవల్ కెనాల్ ప్రాజెక్ట్‌తో పాటు ప్రతిపాదనల్లో ఉన్న మరిన్ని ప్రాజెక్టులను టేకప్ చేశామన్నారు. రూ.40 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ నీటిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టినట్లు వివరించారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టును కూడా జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పూర్తి చేసి జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజ నేయులు, నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, బండి పవన్‌కుమార్, సాకే వెంకటేష్, మీనుగ నాగరాజు, ఈశ్వరయ్య, లింగారెడ్డి, గుగ్గిళ్ల ప్రసాద్‌రెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, సందీప్‌యాదవ్, భానుకోట శివ పాల్గొన్నారు.


