కంది రైతుకు కన్నీరే
శెట్టూరు: మద్దతు ధరతో కందులు కొనుగోస్తామని చెప్పిన ప్రభుత్వం ‘నిబంధనల’ పేరిట రైతుల కంట నీరు తెప్పిస్తోంది. మండల కేంద్రం శెట్టూరులోని రైతు సేవ కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద నుంచి ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటి వరకు 394 క్వింటాళ్ల కందులు సేకరించింది. వీటిని ప్రొద్దటూరుకు తరలించగా.. అక్కడ 22 మంది రైతులకు చెందిన 600 బ్యాగుల కందులను తిరస్కరించారు. దీంతో ఆ కందులను తిరిగి శెట్టూరుకు పంపించారు. సంబంధిత సిబ్బంది బుధవారం ఆయా రైతులకు ఫోన్లు చేసి కందులు వెనక్కు తీసుకెళ్లాలని సమాచారమందించారు. నిబంధనల ప్రకారం తమ వద్ద నుంచి నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేసిన కందులను రెండు వారాల తర్వాత బాగోలేవని వాపసు ఇవ్వడమేంటని సిబ్బందిని నిలదీశారు. అయినా వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో చేసేది లేక రైతులు బుధవారం కందులను పైవేటుగా అమ్ముకోవడానికి రాయచూరుకు తీసుకెళ్లారు. ఈ మాత్రం దానికి ప్రభుత్వం మద్దతు ధరతో కందులు కొనుగోలు చేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
● 620 బ్యాగుల కందులు వెనక్కు


