చింతలరాయుడి ఆలయంలో అద్భుతం
● నేటి నుంచి మూడు రోజుల పాటు వేంకటరమణుడి పాదాలు తాకనున్న సూర్యకిరణాలు
తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలోని పురాతన ఆలయం చింతల వేంకటరమణుడి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు సూర్య కిరణాలు వేంకటరమణుడి పాదాలను తాకనున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రతి ఏటా భీష్మ ఏకదశి పురస్కరించుకొని ఉదయం 7 నుంచి దాదాపు అర గంట పాటు ఆలయంలోని 80 అడుగల రాజగోపురం నుంచి గరుడ అల్వార్ రథ శిలలోకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల ద్వారా సూర్య కిరణాలు దాదాపు 80 అడుగల దూరంలో ఉన్న మూల విరాట్ పాదాలను తాకుతాయన్నారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారన్నారు. దీంతో చింతల వేంకటరమణుడి ఆలయాన్ని భాస్కరక్షేత్రంగా పిలువబడుతోందన్నారు.


