వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
గుంతకల్లు: పట్టణంలోని ఎన్‌టీఆర్ సర్కిల్‌లో ఉన్న మమ్మీ– డాడి రెడీమేడ్ వస్త్ర దుకాణంలో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుకాణాన్ని నాలుగు అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. 30 మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నారు. నాల్గవ అంతస్తులో దుస్తుల స్టాకుతో పాటు జనరేటర్ ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి కరెంట్ సరఫరా తీసేయడంతో జనరేటర్ ఆన్ చేశారు. ఏడు గంటల ప్రాంతంలో జనరేటర్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు వ్యాపించాయి. కింది అంతస్తులోని సిబ్బంది గుర్తించి గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టారు. దుస్తులు, ప్లాస్టిక్ మెటీరియల్ వల్ల మంటలు ఎగిసిపడుతూ.. క్షణాల్లోనే రెండో అంతస్తు వరకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని షాపులను బంద్ చేయించారు. రెండు ఫైరింజన్లు, మునిసిపల్ వాటర్ ట్యాంకర్ల సాయంతో ఐదు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.కోట్ల విలువైన సరుకు కాలిపోయిందని వస్త్ర దుకాణ నిర్వాహకుడు గిరి వాపోయాడు.


