అన్నదాత వెతలు ‘అనంత’ం
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి విపత్తులు.. పాలకుల నిరాదరణ.. అన్నదాతలను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వ్యయప్రయాసలకోర్చి పంటలు సాగు చేసి చేతికొచ్చే సమయంలో నష్టాలు రావడంతో కోలుకోలేకపోతున్నారు. పరిహారం ద్వారా ఆర్థిక ఉపశమనం కల్పించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. నిరాశా నిస్పృహల మధ్యే మంగళవారం జాతీయ రైతు దినోత్సవం (నేషనల్ ఫార్మర్స్ డే) నిర్వహించుకోనున్నారు.
నాడు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు..
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న (2004 – 2009) సమయంలో వ్యవసాయ రంగం పురోగమనం వైపు పయనించింది. పెద్ద ఎత్తున సబ్సిడీలు అందించడంతో రైతులు కోలుకున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామన్న వైఎస్సార్ ప్రకటనను అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు హేళన చేశారు. విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకునేందుకు కూడా పనికిరావు. పరిహారం ఇస్తూ పోతే దానికోసమైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులకు సబ్సిడీలు వేస్ట్’ అంటూ చులకన చేసి మాట్లాడారు. అయితే వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనలో విమర్శలను పటా పంచలు చేసి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం బాట పట్టించారు. ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లూ (2019–2024) వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. ప్రకృతి కూడా సహకరించడంతో అన్నదాతలు కష్టాల నుంచి కోలుకున్నారు. ఉచిత విద్యుత్, ఉచిత బోర్లు, రైతు భరోసా, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్, సున్నావడ్డీ, పావలావడ్డీ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్‌గ్రేషియా, సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు, విత్తనాలతో పాటు పాలవెల్లువ, యాంత్రీకరణ, ఎంఎస్‌పీ ద్వారా అమ్మకాలు చేపట్టారు. అడుగడుగునా వెన్నంటి నిలవడంతో రైతులు కష్టాల నుంచి గట్టెక్కారు.
నేడు కష్టాల కడలిలో కర్షకులు
ఇప్పుడు రైతుల పరిస్థితి తిరిగి మొదటికొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయంలో నష్టాలబాట పట్టారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కరువయ్యాయి. మరోపక్క ప్రకృతి కూడా సహకరించడం లేదు. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టితో వ్యవసాయం చిన్నబోయింది. ‘సూపర్ సిక్స్’ అంటూ గొప్పగా చెప్పినా అమలుకు నోచుకోక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అన్నదాతా సుఖీభవను మొదటి సంవత్సరం ఎగ్గొట్టేసి, ఇప్పుడు రెండో ఏడాది చిల్లర విదిల్చారు. సకాలంలో విత్తనాలు ఇవ్వడం లేదు. విత్తన కేటాయింపులు, రాయితీలు కుదించేశారు. యూరియా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా చీనీ, అరటితో పాటు మొక్కజొన్న, పత్తి, కందులకు గిట్టుబాటు లేదు. అరకొరగా పండిన పంట ఉత్పత్తులను కూడా సరిగా అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా భావించే పాడి, పట్టు, పండ్లతోటల రైతులకూ ప్రోత్సాహకాలు కరువయ్యాయి.
ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ తాత్సారం
‘వైఎస్సార్–జగన్’ హయాంలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఫుల్


