తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
ఆత్మకూరు: హంద్రీ–నీవా కాలువ పక్కన మట్టిపై టీడీపీ నేతల కన్నుపడింది. అంతే అడ్డూ అదుపు లేకుండా మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున దందా సాగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి మీదుగా హంద్రీ–నీవా కాలువ వెళ్లింది. రెండు వారాల కిందట నుంచి టీడీపీకి చెందిన కొందరు హిటాచీ యంత్రాలు పెట్టి హంద్రీ–నీవా కాలువకు ఆనుకుని ఉన్న, సమీపంలోనే ఉన్న గుట్టలో మట్టి తవ్వుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వకాలు చేపట్టి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలించేస్తున్నారు. సారవంతమైన ఈ మట్టిని జిల్లా కేంద్రం అనంతపురం పరిసరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లకు చేరుస్తున్నారు. టిప్పర్ మట్టిని రూ.8వేల చొప్పున అమ్ముకుంటున్నారు. నిబంధనల ప్రకారం మట్టి తరలించాలంటే మైనింగ్, ఇరిగేషన్, రాయల్టీ, రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏ శాఖల నుంచి కూడా అనుమతులు తీసుకోనట్లు తెలుస్తోంది. సాధారణంగా అనుమతి లేకుండా ట్రాక్టర్‌లో మట్టి తరలిస్తేనే సమాచారం అందిన నిమిషాల్లో దాడులు చేసి, వాహనాన్ని స్టేషన్‌కు తరలిస్తుంటారు. మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టిప్పర్ల రాకపోకలతో రోడ్డు కంకర తేలి గుంతలుపడిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లతో పాటు అధికారులకు ముడుపులు అందడం వల్లే మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
హంద్రీ–నీవా కాలువ పక్కన భారీగా తరలిన మట్టి
కాలువ వెంట వెళ్తున్న టిప్పర్
అనుమతులు ఇవ్వలేదు
హంద్రీ–నీవా కాలువ పక్కన ఉన్న మట్టిని తరలించరాదు. అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు రెవెన్యూ శాఖ తరఫున ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదు. అసలు కాలువ పక్కన మట్టి తరలించడానికి అనుమతులు ఇచ్చే అధికారం మాకు కూడా లేదు.
– లక్ష్మీనాయక్, తహసీల్దార్,
ఆత్మకూరు
హంద్రీ– నీవా కాలువ మట్టిపై ‘తమ్ముళ్ల’ కన్ను
వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం
అనుమతులు ఇవ్వలేదంటున్న రెవెన్యూ అధికారులు
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత


