అభాగ్యులకు అందని పింఛన్
● కలెక్టర్‌కు అర్జీల వెల్లువ
అనంతపురం అర్బన్: వారంతా అభాగ్యులు. వయోభారంతో కొందరు.. ప్రమాదాల్లో వైకల్యం బారినపడిన మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. సామాజిక భద్రత పింఛన్ ద్వారా ఆర్థిక ఉపశమనం పొందుతామనుకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఆ అవకాశం లేకుండా పోతోంది. ఏడాదిన్నర అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం సతమతమవుతున్న అభాగ్యులు పింఛన్ కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహంచిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అర్జీలు ఇచ్చుకున్నారు. కలెక్టర్ ఆనంద్‌తోపాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్‌రెడ్డి, తిప్పేనాయక్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ వివిధ సమస్యలపై ప్రజల నుంచి 385 అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో.. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
ఈయన పేరు మారుతీప్రకాష్. అనంతపురం శివారులోని చిన్మయనగర్‌లో నివాసముంటున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించే ఈయన 2023 సంవత్సరం చివరులో ప్రమాదానికి గురవడంతో కుడికాలు తొడ వరకు తొలగించారు. గత ప్రభుత్వంలో దివ్యాంగ పింఛనుకు దరఖాస్తు చేయగా.. మంజూరు చేస్తున్నట్లు అనుమతి వచ్చింది. ఈలోగా ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరు కాలేదని మారుతీప్రకాష్ ఆవేదన చెందాడు. ఇప్పటికై నా స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న ఈ వృద్ధుని పేరు జమాలుద్దీన్. 2011 నుంచి పింఛను తీసుకుంటున్నాడు. ఏడాది క్రితం పింఛన్ తొలగించారు. ఉన్న ఒక్క కొడుకు గుండెపోటుతో మరణించడంతో కోడులు పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆసరాగా ఉన్న పింఛను ఆగిపోవడంతో చాలా కష్టంగా ఉందని తెలిపాడు. పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకున్నానని చెప్పాడు.
బుక్కరాయసమద్రంలో నివాసముంటున్న రేష్మా డ్రిప్ పైపుల కటింగ్ పరిశ్రమలో పని చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కుడిచేయి మిషన్‌లో ఇరుక్కుని ముక్కలైంది. 70 శాతంగా వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛను కోసం ఏడాదిగా తిరుగుతున్నా మంజూరు కాలేదని ఆవేదన చెందింది. భర్త పెయింటర్ అని, ఆయన సంపాదనంతా తాగుడుకు ఖర్చు చేస్తున్నాడని తెలిపింది. దివ్యాంగ పింఛను మంజూరు చేస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చెప్పింది.
అభాగ్యులకు అందని పింఛన్
అభాగ్యులకు అందని పింఛన్
అభాగ్యులకు అందని పింఛన్


