వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ విద్యార్థిని మాధుర్య మృతి చెందిందని, ఇందుకు యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. మాధుర్య కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు సోమవారం పాలక భవనం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు హేమంత్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పులిరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గిరి శాంతరాజు, టీఎన్‌ఎస్‌ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి నాగ తిరుపాల్ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన పీజీ విద్యార్థిని మాధుర్యను ఆదివారం ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోవడం దురదృష్టకరమన్నారు. యూనివర్సిటీలో సకాలంలో వైద్యం అందకపోవడంతోనే మృతి చెందిందని, ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ హెల్త్ సెంటర్ డాక్టర్లు ప్రతినెలా జీతాలు పొందుతున్నా విధులకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. హెల్త్ సెంటర్‌ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి వెంటనే రెండు కొత్త అంబులెన్స్ లు కొనుగోలు చేయాలన్నారు. మహిళా వసతి గృహాల్లో రాత్రి పూట ఒక డాక్టర్, ఒక నర్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థిని మాధుర్య కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. యూనివర్సిటీ పాత అంబులెన్స్‌ను ఆందోళన వద్దకు తెచ్చి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. 15 రోజుల్లో కొత్త అంబులెన్స్‌లు తెప్పిస్తామన్నారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎల్లార్తి చంద్ర, నాగ్రేంద, నాయుడు, సూరి, పవన్, అంజి, నాగరాజు, మల్లి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో వైద్యం అందకే విద్యార్థిని మృతి
రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఎస్కేయూలో విద్యార్థినుల ఆందోళన


