శింగనమల ఎమ్మెల్యే కుటుంబం నుంచి ప్రాణహాని
● ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్త ఆందోళన
గార్లదిన్నె: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని దళిత సామాజికవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ భార్యాపిల్లలతో కలిసి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం, శ్రావణిశ్రీ కోసం ప్రత్యేకంగా పనిచేశానని చెప్పారు. తన సేవలను గుర్తించి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించాలని కోరితే పట్టించుకోలేదన్నారు. వేరొకరికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా తనపై కక్ష కట్టి రేప్ కేసు పెట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగానూ తనను అవమానించారని విలపించారు. ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, ఆమె తల్లి బండారు లీలావతి, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా తనపైనే ఏడు అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే అనుచరులు తనకు ఫోన్ చేసి చంపుతానని బెదిరించారని, ఈ విషయం పోలీసులకు తెలిపినా స్పందించలేదని చెప్పారు. తనకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కు వెళ్లి నాయకులందరినీ కలిసి విన్నవించానన్నారు. జిల్లాలో టీడీపీ పెద్దలకు సమస్యను చెప్పుకునేందుకు వస్తే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఒంటరివాడిని చేయాలని తనను సపోర్టు చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేసే పరిస్థితి కల్పిస్తున్నారన్నారు. గతంలో తనపై రౌడీషీట్, రేపిస్ట్ తదితర కేసులేవీ లేవని, అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్లు
● మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100 ఫీజు
● రూ.10 లక్షలు దాటితే రూ.1000 ఫీజు
అనంతపురం టౌన్: వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూముల మార్కెట్ విలువ రూ.10లక్షల లోపు ఉంటే రూ.100, మార్కెట్ విలువ రూ.10 లక్షలు దాటితే రూ.1000 స్టాంప్ డ్యూటీ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం వారసత్వంగా ఎలా సంక్రమించింది.. వారసత్వ హక్కులు నిర్ధారించడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, కుటుంబ పెద్ద మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు భూహక్కు పత్రాలను కచ్చితంగా జత చేయాలన్నారు. అవసరమైతే వ్యవసాయ భూమికి సబ్ డివిజన్ చేయించి సబ్ డివిజన్ పత్రాలను సైతం సమర్పించాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే దగ్గరలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ సూచించారు.
పర్యాటకాభివృద్ధికి చర్యలు
అనంతపురం అర్బన్: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పర్యాటక అభివృద్ధి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిపై దృష్టి సారించాలని చెప్పారు. గుత్తి కోట సమీపంలో కరిడికొండ ఐదు ఎకరాలు, ఎగువపల్లి (గార్లదిన్నె) 10 ఎకరాలు, గజరాంపల్లి (పామిడి) ఒక ఎకరా, భైరవాని తిప్ప ప్రాజెక్టు (గుమ్మఘట్ట) మూడు ఎకరాల స్థలం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని పర్యాటక శాఖ అధికారి జయకుమార్ కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్కియాలజీ మ్యూజియం, పాత జిల్లా జైలు, పీస్ మోమోరియల్ హాలు, జిల్లా సైన్స్ సెంటర్, శిల్పారామానికి ప్రజలు, పిల్లలు ఎప్పుడూ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జనవరిలో గుత్తికోట ఉత్సవాలు
గుత్తికోట ఉత్సవాలు 2026 జనవరి 24 నుంచి రెండు రోజుటపాటు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్‌బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, కమిటీ సభ్యులు సంధ్యామూర్తి, రవికాంత్ రమణ, నాగేశ్వరరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


