ఊరేగింపు ప్రశాంతంగా సాగాలి
అనంతపురం ఎడ్యుకేషన్: కురుబ కులస్తుల దైవం సంగాలప్ప స్వామి ఊరేగింపును కపాడం, కమతం వంశస్తులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆర్డీఓ కేశవనాయుడు సూచించారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలో రాప్తాడు మండలం గొల్లపల్లిలో గొల్లపల్లయ్యస్వామితో కలిపి సంగాలప్పస్వామి ఊరేగింపు జరగనుంది. ఈ నేపథ్యంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కేశవనాయుడు అధ్యక్షత శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ధర్మవరం ఆర్డీఓ మహేష్‌కుమార్, అనంతపురం, ధర్మవరం డీఎస్పీలు శ్రీనివాసరావు, హేమంత్, బత్తలపల్లి, రాప్తాడు సీఐలు, కపాడం, కమతం వంశానికి చెందిన పెద్దలు పాల్గొన్నారు. సంగాలప్పస్వామి విషయంలో యర్రాయపల్లి కమతం వారు, గంగలకుంట కపాడం వారు తమదంటే తమదే అని చెప్పుకుంటున్నారు. 1999లో సంగాలప్పస్వామిని యర్రాయపల్లికి చెందిన కమతం వంశస్తులు గంగలకుంటకు పంపారు. ఈ విషయంలో గంగలకుంట కపాడం వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఒక్కో ఊరిలో ఆర్నెళ్ల పాటు స్వామివారి ఉత్సవ విగ్రహం ఉండేలా 2005లో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును అమలు చేయకుండా యర్రాయపల్లి కమతం వారు హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దీనిపై కపాడం వంశస్తులు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గత నెల 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత యర్రాయపల్లి కమతం వంశస్తులు స్వామివారి ఊరేగింపు చేశారు. అయితే సంగాలప్పస్వామి రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లయ్య స్వామికి బంధుత్వం ఉన్నట్లు గుడికట్ల నమ్మకం. మొదటిపూజ తర్వాత రెండోపూజ గొల్లపల్లయ్యస్వామితో కలిపి ఊరేగించడం ఆనవాయితీ అని రెండు వంశాల వారు తెలిపారు. 30 ఏళ్లుగా గొల్లపల్లిలో రెండోపూజ జరగలేదు. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు తర్వాత యర్రాయపల్లి కమతం వారు స్వామివారిని గొల్లపల్లికి ఊరేగింపుగా తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రెండు వంశస్తులను పిలిపించి స్వామివారి ఊరేగింపు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. పెద్దలు చొరవ తీసుకోవాలని, ఎవరైనా సమస్యలు సృష్టిస్తే మాత్రం చట్టపరంగా చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.
కురుబ వంశస్తులకు అధికారుల సూచన
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో
శాంతి కమిటీ సమావేశం


