పత్తి రైతులు చలికి చిత్తు
గుత్తి: పత్తి విక్రయించడానికి తెల్లవారుజామునే రావాల్సి రావడంతో రైతులు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు గుత్తి వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. వారంలో ఒక్కసారి బుధవారం మాత్రమే పత్తి కొంటారు. ఈ క్రమంలో బుధవారం గుత్తి నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాల రైతులు పత్తిని వాహనాల్లో లోడ్ చేసుకుని తెల్లవారుజామున నాలుగు గంటకే పత్తి కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. అధికారులు ఉదయం 10 గంటలకు వచ్చారు. రైతులు అంతవరకూ చలికి వణుకుతూనే ఆహార పానీయాలు లేకుండా గడపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే అదీ అరకొరగా, నామమాత్రంగా పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వారంలో కనీసం నాలుగు రోజులైనా పత్తి కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఆయిల్‌పాం విస్తరణపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: వాణిజ్య పంటగా ఆయిల్‌పాం (పామాయిల్)ను విస్తరించే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడేం వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతిరెడ్డి, ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి తదితరులు బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. పామాయిల్ తోటల సాగుకు జిల్లాలో ఆరు మండలాలు అనువుగా ఉంటాయని గుర్తించి, రైతులను ప్రోత్సహించడానికి కంపెనీలకు గతేడాది బాధ్యతలు అప్పగించినట్లు వారు తెలిపారు. అందులో కూడేరు, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో ఇప్పటికే పంట సాగు చేశారన్నారు. తాజాగా రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో ఐదు మండలాల్లో సాగు అవకాశాల పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. కొత్తగా విడపనకల్లు, గుమ్మఘట్ట, రాయదుర్గం, ఆత్మకూరుతో పాటు బెళుగుప్ప మండలాల్లో సాగుకు అనువుగా ఉందా లేదా అనే దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. మంచి నేలలు, ఏడాది పొడవునా నీటి సదుపాయం తప్పనిసరి అన్నారు. తరచూ బెట్ట పరిస్థితులు ఏర్పడే ప్రాంతాల్లో ఆయిల్‌పాం మంచిదికాదన్నారు.
టెట్ తొలిరోజు ప్రశాంతం
● 866 మంది అభ్యర్థులు హాజరు
అనంతపురం సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తొలి రోజైన బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా అనంతపురం, తాడిపత్రి, గుత్తి ప్రాంతాల్లోని మొత్తం ఏడు కేంద్రాల్లో 940 మందికి గాను 866 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. 74 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఉదయం జరిగిన పరీక్షకు 470 మందికి గాను 433 మంది, మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌లో 470 మందికి గాను 433 మంది హాజరయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఈఓ తెలిపారు.


