స్క్రబ్ టైఫస్‌పై అలర్ట్
● సర్వజనాస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు
భయపడాల్సిన పనిలేదు
స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల భయపడాల్సిన పనిలేదు. కీటకం కుట్టిన చోట నల్లటి గుర్తు ఏర్పడి, ఆ చుట్టూ ఎర్రగా ఉంటుంది. తర్వాత జ్వరం, తలనొప్పి, తదితర లక్షణాలు కన్పిస్తే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వారం రోజుల పాటు సరైన వైద్యం తీసుకుంటే నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
– డాక్టర్ యాసర్ అరాఫత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జీజీహెచ్
అనంతపురం మెడికల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇందులో మంగళవారం ముదిగుబ్బ, గుమ్మఘట్ట మండలం తాళ్లకెర ప్రాంతానికి చెందిన ఇద్దరికి పాజిటివ్ ఉన్నట్లు బయటపడగా.. బుధవారం కిరికెర గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ పాజిటివ్ కేసుల్లో ఐదు నెలల గర్భిణి ఉండటం గమనార్హం. కేసులు కలకలం రేపుతుండటంతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సూపరింటెండెంట్ కేఎల్ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. ఈఎన్‌టీ వార్డులోని రోగులను మరో వార్డుకు తరలించి.. అక్కడ 20 పడకలతో ప్రత్యేక స్క్రబ్ టైఫస్ వార్డు ఏర్పాటు చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి ర్యాపిడ్ యాక్షన్ టీంను అందుబాటులో ఉంచారు. మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ భీమసేనాచార్, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవి కుమార్, వైద్య కళాశాల నుంచి డాక్టర్ ఆది నటేష్, డాక్టర్ సరోజమ్మ, డాక్టర్ కృష్ణవేణిని నియమించారు. నిరంతరాయంగా సేవలందించేందుకు స్టాఫ్‌నర్సులకు మూడు షిఫ్టులు కేటాయించారు.
స్క్రబ్ టైఫస్‌పై అవగాహన
గుమ్మఘట్ట: తాళ్లకెరకు చెందిన ఓ విద్యార్థిని స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడినట్లు తెలియడంతో మలేరియా సబ్‌యూనిట్ అధికారి నాగేంద్రప్రసాద్, వైద్యులు సందేశ్, తహసీల్దార్ రజాక్‌వలి, ఎంపీడీఓ జయరాములు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కీటకనాశిని మందుతో గ్రామంలో పిచికారీ చేయించారు.
స్క్రబ్ టైఫస్‌పై అలర్ట్


