వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి చక్రాల కిందపడి ఒకరు మృతి చెందగా... లారీని వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు.
రాయదుర్గం టౌన్: మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప (55) వ్యక్తిగత పనిపై గురువారం రాయదుర్గానికి వచ్చాడు. పని ముగించుకుని సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన టి.వీరాపురం సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవరటేక్ చేసే క్రమంలో అదుపు తప్పి బస్సు వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య వడ్రక్క, ఓ కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో పాటు జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జయానాయక్ తెలిపారు.
తాడిపత్రి రూరల్: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి తన ఇద్దరు కుమారులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన అన్న కుమారుడు బండి చరణ్ (18)తో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం సాయంత్రం తాడిపత్రిలోని ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు బయలుదేరాడు. తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో బైక్ నడుపుతున్న బండి చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలేటికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిలేటి కుమారులు అర్జున్, సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.
ఆ గన్ ఎక్కడిది?
అనంతపురం సెంట్రల్: నగరంలో విద్యుత్‌నగర్ సర్కిల్‌లో ఓ వ్యక్తి ఇంట్లో బయటపడిన గన్ ఎక్కడిదనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. దంపతుల మధ్య నెలకొన్న మనస్పర్థల కేసులో దిశ పోలీసులు బుధవారం సదరు వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో గన్‌తో పాటు కత్తి పట్టుబడడం కలకలం రేపింది. గురువారం కూడా సదరు గన్ గురించి దిశ పోలీసులు నోరు మెదప లేదు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం


