రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం
● ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజం
ఉరవకొండ: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే రైతులు రోడ్డున పడ్డారన్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గిట్టుబాటు ధర లేక పంటను రోడ్డు మీద రైతులు పారవేస్తున్నారన్నారు. ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు చేపట్టకపోవడంతో లక్ష ఎకరాలు బీడుగా మారాయన్నారు. కందిలో దిగుబడులు లేవన్నారు. మిర్చి పంటను తెగుళ్లు నాశనం చేస్తున్నాయన్నారు. దీంతో పెట్టుబడులు సైతం చేతికి అందని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా ఉన్న ఊళ్లోనే రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడమే కాకుండా, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు సకాలంలో అందడంతో వ్యవసాయం లాభసాటిగా సాగిందన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వడ్డే వెంకట్
అనంతపురం కల్చరల్: నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ముదిగుబ్బకు చెందిన వడ్డే వెంకట్‌ను నియమిస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకట్ నియామకంపై జిల్లా వడ్డెర సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
గర్భం దాల్చిన బాలిక
ఉరవకొండ: ప్రేమ పేరుతో ఓ బాలిక వంచనకు గురైంది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలను ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది గురువారం వెల్లడించారు. బొమ్మనహల్ మండలం శ్రీధరగట్టు గ్రామానికి చెందిన యువకుడు శివమణి కొంత కాలంగా ఉరవకొండ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మభ్యపెట్టి పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయం గుర్తించిన బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పీఏబీఆర్ గేట్లు బంద్
కూడేరు: మండలంలోని పీఏబీఆర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో గురువారం సాయంత్రం క్రస్డ్ గేట్లను అధికారులు బంద్ చేశారు. ప్రస్తుతం పీఏబీఆర్‌కు 220 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 340 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. నీటి మట్టం 5.18 టీఎంసీలు ఉన్నట్లు ఇరిగేషన్ జేఈఈ తెలిపారు.
ధర్మవరంలో వృద్ధురాలికి
స్క్రబ్ టైఫస్
ధర్మవరం అర్బన్: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు స్క్రబ్ టైఫస్ బారిన పడింది. ఈ నెల 8న తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఆమె నడుముపై నల్లటి మచ్చను వైద్యులు గుర్తించి వైద్య పరీక్షలకు రెఫర్ చేశారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో నిర్వహించిన ఐజీఎం ఎలిసా పరీక్షలో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గురువారం ఫలితాలు అందినట్లు ధర్మవరం ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ తెలిపారు. ప్రస్తుతం వృద్ధురాలికి ధర్మవరం ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం


