విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బాబు మౌనం వీడాలి
● సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
అనంతపురం అర్బన్: పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని, ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఇప్పటికై నా మౌనం వీడాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సీపీఐ వందేళ్ల వేడుక సందర్భంగా గురువారం అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన ఉద్యమవీరుల కుటుంబాల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీజేపీ పాలనలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దేశానికి ప్రమాదకరమన్నారు. రాజ్యాంగంలోని లౌకిక, సోషలిస్టు పదాలను తొలగించి దేశాన్ని మతరాజ్యంగా మారుస్తున్న బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, నితీష్‌కుమార్‌పై ఉందన్నారు. మోదీ బయటికు గాంధీ పేరు జపిస్తున్నా.. మనసులో మాత్రం గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సేనే ఉన్నారని ఆరోపించారు. పాలనలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నారని, రాష్ట్ర సంపదను అనుయాయులకు దోచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. భూములను కారు చౌకగా తన అనుయాయ కంపెనీలకు కట్టబెడుతూ ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.


