రైల్వే సొమ్ము కాంట్రాక్టర్ పాలు
● బాగున్న డ్రెయినేజీలపైనే మళ్లీ కట్టడాలు
గుంతకల్లు: స్థానిక డీఆర్‌ఎం కార్యాలయ సమీపంలోని వీవీ నగర్‌లో రైల్వే నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. జోనల్ వర్క్‌లో భాగంగా రూ.లక్షలు వెచ్చించి రైల్వే ఉద్యోగుల వసతి సముదాయం ప్రహరీతో పాటు డ్రెయినేజీల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే వందశాతం మెరుగ్గా ఉన్న డ్రెయినేజీలపై రాతి కట్టడం చేపట్టడం గమనార్హం. ఈ పనిలోనూ ఒకసారి వినియోగించి తొలగించిన రాళ్లనే మళ్లీ వాడుతూ కాంట్రాక్టర్ అక్రమాలకు తావివ్వడం విమర్శలకు దారి తీస్తోంది. కాంట్రాక్ట్‌కు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్‌లో ఒకసారి వినియోగించిన రాళ్లను మళ్లీ వాడాలనే నిబంధన లేదు. రైల్వే ఉద్యోగుల పురాతన వసతి గృహాలను కూల్చివేయడం ద్వారా బయటపడిన ఒక్కో రాయిని 50 పైసలతో కాంట్రాక్టర్ కొనుగోలు చేసి, వాటిని డ్రెయినేజీ నిర్మాణానికి వాడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
కొరవడిన పర్యవేక్షణ
రైల్వే నిధులతో చేపట్టిన పనులను సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను ఓ సూపర్‌వైజర్‌కు అధికారులు కేటాయించారు. అయితే పని ప్రాంతంలో ఆయన ఎన్నడూ కనిపించరు. ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు వెళ్లిపోతాడో ఎవరికీ తెలియదు. దీంతో పనులు నాసిరకంగా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఐఓడబ్ల్యూ శివదాసన్‌ను వివరణ కోరగా... వీవీ నగర్, ప్రభాత్‌నగర్ జోనల్ పరిధిలో స్పెషల్ వర్క్ కింద దాదాపు రూ.1.80 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో పార్కు అభివృద్ధి, ఉద్యోగుల వసతి గృహాల ప్రహరీ, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. వర్షం వచ్చినప్పుడు డ్రెయినేజీలో మట్టి పడకుండా ఉండేందుకు ఎత్తు పెంచుతూ రాతి కట్టడం కడుతున్నట్లు పేర్కొన్నారు.


