అమిలినేని అడ్డదారులు
కళ్యాణదుర్గం: సంఖ్యాబలం లేదు. అయినా మున్సిపల్ చైర్మన్‌గిరి కోసం టీడీపీ ఆరాటపడుతోంది. ఇందుకోసం అడ్డదారులు తొక్కింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. తాజాగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు డబ్బు ఎరచూపి.. వినని వారిని బెదిరించి మొత్తానికి ఆరుగురిని తమవైపు లాగేసుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నాలుగు వార్డులను కై వసం చేసుకుంది. మిగిలిన 19 వార్డులలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
మళ్లీ అదే ఫార్ములా..
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డబ్బు ఎర చూపించారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆశచూపి ఐదుగురిని టీడీపీలోకి చేర్చుకున్నారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. అయితే ఇటీవల కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మరోసారి అదే ఫార్ములా ప్రయోగించారు. సంఖ్యాబలం లేక వైఎస్సార్‌సీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణీంద్రను రెండురోజుల క్రితం టీడీపీలోకి చేర్చుకున్నారు.
ఓటమి భయంతో క్యాంపు రాజకీయాలు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవుతుందని గ్రహించిన ఎమ్మెల్యే అప్రమత్తమై క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి చేరిన కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి అనంతపురం తరలించారు. ఓ అపార్ట్‌మెంట్ లో 11 మంది కౌన్సిలర్లను తన ఆధీనంలో పెట్టుకున్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా గురువారం నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
మాట వినకుంటే బెదిరింపులు
టీడీపీని కాదని వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేస్తే సహించేది లేదంటూ కౌన్సిలర్లను హెచ్చరించినట్లు సమాచారం. మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణీంద్రను బెదిరించినట్లు విమర్శలు వినిపించాయి. ఈ నెల 5న తన పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వైఎస్సార్‌సీపీ అఽధిష్టానాన్ని ఫణీంద్ర వేడుకున్నారు. దీంతో స్పందించిన పార్టీ కేంద్ర కార్యాలయం జయం ఫణీంద్ర సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది. జయం ఫణీంద్ర వైఎస్సార్‌సీపీ ఉంటే టీడీపీకి పూర్తిగా నష్టం జరుగుతుందని భావించి.. అదే రోజు రాత్రి ఫణీంద్రను బెదిరించి మరీ టీడీపీలోకి చేరేలా ఎమ్మెల్యే అమిలినేని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌గిరి కోసం దిగజారిన వైనం
సంఖ్యాబలం లేక వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు డబ్బుతో ఎర
ప్రత్యేక క్యాంపు నుంచి నేడు నేరుగా ఎన్నిక కేంద్రానికి


