రూ.3.74 లక్షల విలువైన ఎరువుల విక్రయాల నిలుపుదల
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక భాస్కర్ అగ్రి సొల్యూషన్ దుకాణంలోవ్యవసాయశాఖ గుత్తి ఏడీఏ ఎం.వెంకటరాముడు, రూరల్ ఏఓ వెంకట్‌కుమార్ బుధవారం తనిఖీలు చేపట్టారు. సరైన అనుమతి పత్రాలు లేని నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన రూ.3,74,324 విలువ చేసే ఎరువుల విక్రయాలు నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు.
పీఏబీఆర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) లోకి బుధవారం ఇన్‌ఫ్లో బాగా తగ్గిపోయింది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 570 క్యూసెక్కుల చేరుతుండగా, 470 క్యూసెక్కులు తగ్గించారు. దీంతో 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతోంది. అలాగే హెచ్చెల్సీ లింక్ చానల్ ద్వారా 150 క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్‌లో 5.18 టీఎంసీలకు నీటి మట్టం చేరుకోవడంతో రెండు గేట్ల ద్వారా 460 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మిడ్ పెన్నార్ డ్యామ్‌కు విడుదల చేస్తున్నారు.
ఏడీఏ అల్తాఫ్‌కు బెదిరింపు
అనంతపురం సెంట్రల్: వ్యవసాయ శాఖలో అనంతపురం ఏడీగా పనిచేస్తున్న అల్తాఫ్ ఖాన్‌కు ఓ దుండగుడు బెదిరింపు కాల్ చేసి బ్లాక్ మెయిల్‌కు దిగిన అంశం సంచలనం రేకెత్తించింది. ఘటనపై అనంతపురం రెండో పట్టణ పోలీసులకు ఏడీఏ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి 2021 వరకూ ఓ పురుగుల మందుల కంపెనీలో పనిచేశాడు. కారణాలు ఏమైనా అతన్ని విధుల నుంచి కంపెనీ తొలగించింది. అప్పటి నుంచి పురుగు మందులు ఇస్తానంటూ నమ్మబలికి రైతులను మోసం చేస్తూ రావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా తన వాట్సాప్ ప్రొఫైల్‌లో అవినీతి నిరోధక శాఖ సీఐ హమీద్ ఖాన్ ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకుని అధికారులకు తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ నగదు లాక్కొనేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఏడీఏ అల్తాఫ్ ఖాన్‌కు ఫోన్‌కాల్ చేస్తూ తనను తాను ఏసీబీ ఇన్‌ఫార్మర్‌గా పరిచయం చేసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చాడు. ‘నగరంలోని ఎన్‌ఆర్ ఫర్టిలైజర్స్‌లో పట్టుకున్న మూడు ఆటోలకు డబ్బులు తీసుకొని వదిలేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నేను చెప్పినంత డబ్బు ఇవ్వాలి. లేదంటే ఏసీబీ సీఐకి చెప్పి నీపై దాడులు చేయిస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బుధవారం ఏడీఏ ఫిర్యాదు మేరకు టౌటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు
రొళ్ల: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లి నివాసి, ఆర్డీటీ మాజీ సీఓ వన్నూరుస్వామి, ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్, ఉమెన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ మాజీ మేనేజర్ పి.శ్రీనివాసరావుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు రొళ్ల పీఎస్ ఏఎస్‌ఐ హిదయ్‌తుల్లా తెలిపారు. వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. రొళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన లింగాయత్ అడివేష్ సహకారంతో 2023లో ఆర్డీటీ, డ్వాక్రా మహిళ సంఘాల సభ్యులు డిపాజిట్ చేసిన రూ.1,500కు సంస్థ తరఫున వడ్డీ చెల్లించడంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి నిత్యావసర సరుకులు అందుతాయని వన్నూరు స్వామి, శ్రీనివాసరావు నమ్మించారు. ఈ క్రమంలో రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నారు. ఇప్పటి వరకూ నిత్యావసర సరుకులు ఇవ్వలేదు. డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కు చెల్లించాలని అడిగినా సమాధానం ఇవ్వడం లేదు. దీంతో మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న అడివేష్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
భార్యపై వేధింపులు..
భర్త నుంచి గన్, కత్తి స్వాధీనం
అనంతపురం సెంట్రల్: నగరంలోని విద్యుత్ నగర్‌లో దంపతుల మధ్య చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో భర్త వద్ద గన్, కత్తి లభ్యం కావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. విద్యుత్‌నగర్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి.. ఓ యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్ని నెలలుగా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయినా ఫలించకపోవడంతో తాజాగా బాధితురాలు దిశ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించిన వస్తువులు, దుస్తులు ఇప్పించాలన్న ఆమె వేడుకోలుకు స్పందించిన దిశ పోలీసులు బుధవారం నేరుగా విద్యుత్ నగర్‌లోని భర్త ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఏకంగా గన్‌తో పాటు ఓ కత్తి కూడా లభ్యమైంది. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వివరాలు వెల్లడించేందుకు దిశ పోలీసులు నిరాకరించారు. గన్ ఎక్కడ నుంచి వచ్చింది. ఆయుధాలను ఇంట్లో ఎందుకు దాచాడు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.


