అన్నదాత ఆత్మహత్యలకు చంద్రబాబుదే బాధ్యత
● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
ఉరవకొండ: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలకు చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ మోసమేనన్నారు. రైతులు పండించిన పంటలకు 18 నెలల కాలంలో ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించారో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, గతంలో అరటి టన్ను రూ.2,300 పలికేదని, ఇప్పుడు రూ.50 కూడా అడిగేవారు లేరన్నారు. గిట్టుబాటు ధర లేక పంటను ట్రాక్టర్లతో తొలగిస్తూ, రోడ్డుపైన పారేస్తున్నారన్నారు. మిరపకు బదులుగా లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారన్నారు. గతంలో మొక్కజొన్న క్వింటా రూ.2,600 పలికితే ప్రస్తుతం రూ.1400 పోవడంలేదని అన్నారు. పత్తి క్వింటా రూ.8,100 ఉంటే ప్రస్తుతం రూ.5,500 పలకలేదన్నారు. ప్రస్తుతం కందులు 3 లక్షల ఎకరాల్లో సాగవుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. జిల్లాలో రాయితీపై శెనగ విత్తనాలు ఆలస్యంగా ఇవ్వడంతో రైతులు సద్వినియోగం చేసుకోలేకపోయారని, వాటిని టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకున్నారన్నారు.
ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్
సబ్సిడీకి మంగళం:
చంద్రబాబు ఆర్బీకేలను నిర్వీర్యం చేసి ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలకు మంగళం పాడారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతులకు అవసరమైన యూరి యా, మందుల కొరత ఉందని, మినీ కిట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులకు రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయి పడి, పంటల బీమాకు మంగళం పాడారన్నారు. దీంతో పాటు అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రెండేళ్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారన్నారు. ఈ సమస్యలపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో వాటిని డైవర్ట్ చేయడానికి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని చంద్రబాబు తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్‌కు తేరలేపరన్నారు. తక్కువ మంది సిబ్బందితో లక్షలాది మంది రైతులను కలిసినట్లు ఎక్కడో ఓ టీడీపీ నాయకుడి ఇంటి వద్ద కూర్చొని వారి ఫొటో తీసుకొని పంపుతున్నారన్నారు.
10న ఉరవకొండలో జరిగే
ర్యాలీని జయప్రదం చేయండి..
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఉరవకొండలో చేపట్టిన కోటిసంతకాల సేకరణలో భాగంగా 60 వేలు సంతకాలు పూర్తి చేశామని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈసంతకాలను సేకరించి వాటిని ర్యాలీగా అనంతపురానికి తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. ఈసంతకాలను ఈనెల 13న విజయవాడకు తరలించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రసాద్, పార్టీ రాష్ట్ర నాయకులు ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, మార్కెట్‌యార్డు మా జీ చైర్‌పర్సన్ సుశీలమ్మ, మాజీ ఎంపీపీ చందాచంద్రమ్మ, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న తదితరులు పాల్గొన్నారు.


