డిటోనేటర్ల దొంగల అరెస్ట్
● 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించిన పోలీసులు
పెద్దవడుగూరు: మండలంలోని కోనాపురం సమీపంలో ఉన్న కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్‌లో సోమవారం రాత్రి డిటోనేటర్లను అపహరించుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన చోటు చేసుకున్న 24 గంటల్లోపే కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెద్దవడుగూరు పీఎస్‌లో బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి వెల్లడించారు. పట్టుబడిన వారిలో యాడికి మండల చందన గ్రామానికి చెందిన రవికుమార్, పామిడిలోని నాగిరెడ్డి కాలనీ నివాసి చిట్టావుల రాము, కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన ఉప్పర వీరేష్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రవికుమార్ గతంలో కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎక్స్‌ప్లోజివ్ మ్యాగజైన్ విభాగం డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే జీతం ఇవ్వకపోవడంతో పని మానేశాడు. ఈ క్రమంలో పలుమార్లు అడిగినా మేనేజర్ శ్యాంకుమార్ జీతం చెల్లించలేదు. స్టాక్ పాయింట్‌లో నిల్వ ఉన్న ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్‌ను తీసుకెళ్లి విక్రయించి తన డబ్బు తీసుకోవాలని భావించిన రవికుమార్.. తన స్నేహితులు చిట్టావుల రాము, ఉప్పర వీరేష్‌తో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కారులో కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్ గోదాము వద్దకు చేరుకుని గోడకు కన్నం వేసి లోపలకు ప్రవేశించారు. రూ.2 లక్షల విలువైన డిటోనేటర్లు అపహరించుకెళ్లారు. మంగళవారం ఉదయం విషయాన్ని గుర్తించిన మేనేజర్ శ్యాంకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో చందన గ్రామ సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ ఆంజనేయులు, పెద్దపప్పూరు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్, పెద్దవడుగూరు ఏఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది మధుసూధన్, రామకృష్ణ, మోహన్, లక్ష్మీనారాయణ, షాషావలి, కిషోర్‌రాజు, సూర్యనారాయణ, సుధాకర్‌నాయక్‌ను ఏఎస్పీ రోహిత్‌కుమార్ అబినందించారు.


