బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్ధులు
బొమ్మనహాళ్: గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్ధుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉంతకల్లు క్రాస్ వద్ద కళ్యాణదుర్గం–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారి ఎస్‌ఎఫ్‌ఐ స్టేట్ కమిటి సభ్యుడు బంగి శివ, సీఐటీయూ జిల్లా కోశాధికారి నాగమణి, మండల నాయకుడు ఓబులేసు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్ధులు ఆందోళనకు దిగారు. బస్సులు నిలపకపోవడంతో కళాశాలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని, చదువులకు దూరమవుతున్నామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల వదిలిన తర్వాత సాయంత్రం వచ్చే బస్సులు ఒక్కటి కూడా ఆపడం లేదని, తాము ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతోందన్నారు. పాసులు జారీ చేసి బస్సులు ఆపకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటపాటు బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా బస్సులు, లారీలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని రాయదుర్గం, కళ్యాణదుర్గం ఆర్టీసి డీపోల మేనేజర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. బస్సులు కళాశాల సమయానికి పంపుతామని, ఉంతకల్లు క్రాస్ వద్ద నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్ధులు, ప్రజాసంఘాల నాయకులు శాంతించారు. ఆందోళన విరమించడంతో వాహనాలు ముందుకు కదిలాయి.


