అరటి రైతు నిరసనాగ్రహం
అనంతపురం: కడుపు మండిన అరటి రైతులు చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా కదం తొక్కారు. వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అరటి గెలలను భుజాన తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట పారపోసి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడే బైఠాయించారు. ఆరుగాలం శ్రమించి పండించిన అరటి పంటను పొలాల్లో ట్రాక్టర్లతో దున్నివేయాల్సి వస్తోందని, పశువులకు మేతగా వేస్తున్నామని ఆవేదన చెందారు. వెంటనే అరటి పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందన్నారు. అరటి రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అరటి గెలలు కొనే నాథుడే లేక చెట్లలోనే మాగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు రూపాయలకే కిలో అరటి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని వాపోయారు. కిలో రూ. 7–10తో కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నదంతా డ్రామా అని విమర్శించారు. తాము 24 టన్నుల అరటి కాయలు తీసుకొచ్చామని, ప్రభుత్వం చెబుతున్న రేటుతో కొనుగోలు చేస్తే రూ.500 మినహాయింపు కూడా ఇస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎకరా రూపాయికి కట్టబెడుతున్న చంద్రబాబుకు రైతుల సంక్షేమం మాత్రం పట్టడం లేదన్నారు. రోజూ ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
జగన్ పాలన చూసి నేర్చుకోండి:
వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని శైలజానాథ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రైతుల గురించి అవగాహనే లేదని, ఆయన గురించి మాట్లాడుకోవడమే వృథా అని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అదే సిద్ధాంతంతో అన్నదాతలను నట్టేట ముంచుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లాలో ఏకంగా 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని, రైతన్నకు తోడుగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుందని స్పష్టం చేశారు. అనంతరం మాజీ మంత్రి శైలజానాథ్ రైతులతో కలిసి కలెక్టర్ ఆనంద్‌కు వినతి పత్రం సమర్పించి, రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, శ్రీరామరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు సాకే రుత్విక్ హృదయ్, సాకే చంద్రశేఖర్, నార్పల సత్యనారాయణ రెడ్డి, శ్రీరామ రెడ్డి, బండ్ల ప్రతాప్ రెడ్డి, భోగాతి ప్రతాప్ రెడ్డి, సూరి, పూల ప్రసాద్, మహేశ్వర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్ బాషా, నీలం భాస్కర్, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, శివశంకర్ నాయక్, శ్రీనివాస నాయక్, మారుతీ నాయుడు, చామలూరు రాజగోపాల్, మిద్దె కుళ్లాయప్ప, విష్ణు నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలతో సీఐ దురుసు ప్రవర్తన..
రైతుల నిరసన సందర్భంగా కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అరటి గెలలతో నిరసన తెలుపుతున్న రైతులపై వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించగా.. అన్నదాతలూ అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఇలా మాట్లాడడం సమంజసం కాదంటూ హితవు పలికారు. అంతలోనే మరో సీఐ వచ్చి సర్దిచెప్పి పంపింజేశారు.
కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న అరటి రైతులు, నాయకులు, కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న మాజీ మంత్రి శైలజానాథ్
జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ
పెద్ద సంఖ్యలో తరలివచ్చి
కలెక్టరేట్ వద్ద ధర్నా
పంటను రోడ్డుపై పారబోసి నిరసన
మాజీ మంత్రి శైలజానాథ్
ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం
రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా చంద్రబాబూ..?: శైలజానాథ్ ఆగ్రహం
అరటి రైతు నిరసనాగ్రహం


