సమస్యలు పరిష్కరించండి సారూ..
● పరిష్కార వేదికలో ప్రజల వేడుకోలు
● వివిధ సమస్యలపై 437 వినతులు
అనంతపురం అర్బన్: ‘‘సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాము.. అర్జీలు ఇస్తూనే ఉన్నాము. ప్రయోజనం ఉండడం లేదు. దయచేసి మా సమస్యలు పరిష్కరించి ఆదుకోండి’’ అంటూ ప్రజలు అర్జీదారులు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు, తిప్పేనాయక్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వర్మ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యను నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు.
వినతులు కొన్ని...
● మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం రూరల్ మండలం కళ్యాణదుర్గం రోడ్డు రాఘవేంద్ర కాలనీకి చెందిన రామకృష్ణారావు తదితరులు విన్నవించారు. ద్వారకా విల్లాస్ వరకు మంచినీటి సరఫరా చేస్తున్నారని, అక్కడి నుంచి పైప్‌లైన్ పొడిగించి తమ కాలనీకి నీటి సరఫరా చేయాలని కోరారు.
● ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద నుంచి రూ.1.55 లక్షలు తీసుకుని మోసం చేసిందని నగరంలోని ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన కుమ్మర లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పించడం లేదని, తీసుకున్న డబ్బు కూడా తిరిగివ్వడం లేదని చెప్పింది. గట్టిగా అడిగితే మూడు చెక్‌లు ఇచ్చిందని అవి బ్యాంకులో చెల్లలేదని తెలిపింది. ఆమె నుంచి తనకు డబ్బు ఇప్పించాలని కోరింది.
● వితంతు పింఛను మంజూరు చేయించాలని అనంతపురం రూరల్ మండలం సజ్జల కాల్వకు చెందిన ఎం.రత్నమ్మ విన్నవించింది. తన భర్త గత ఏడాది నవంబరు 3వ తేదీన మరణించాడని చెప్పింది. కుటుంబ పోషణ కష్టంగా ఉందని, పింఛను మంజూరు చేయించి ఆదుకోవాలని కోరింది.
ఇతని పేరు ఏకుల కృష్ణ. కూడేరు మండలం లెప్రసీ కాలనీలో ఉంటున్నాడు. ఈయన భార్య అలివేలమ్మ పేరున 2.48 ఎకరాల భూమి (ఖాతా నంబరు 1083) ఉంది. ఇటీవల అలివేలమ్మ మరణించింది. ‘అన్నదాత సుఖీభవ’ కింద మొదటి, రెండో విడతలో సాయం జమ కాలేదని చెప్పాడు. చాలా సార్లు అర్జీ ఇచ్చానని, సమస్య పరిష్కరిస్తామని పంపిస్తారే తప్ప ఇప్పటికీ పరిష్కరించలేదని వాపోయాడు.
ఈమె పేరు సారంబీ. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి. ఈమెకు ఎకరా భూమి ఉంది. ‘అన్నదాత సుఖీభవ’ నగదు జమ కాలేదు. ఈమె ఆధార్‌కు వీఆర్‌ఓ అథెంటికేషన్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగి అని చూపిస్తోంది. దీంతో డబ్బులు జమ కావడం లేదు. పలుమార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
సమస్యలు పరిష్కరించండి సారూ..
సమస్యలు పరిష్కరించండి సారూ..


