మహిళలపై హింసకు అడ్డుకట్ట వేయాలి
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: మహిళలు, బాలికలపై జరిగే హింసకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. మహిళలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ పక్షోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను సైతం’’ అంటూ అందరూ భాగస్వాములై మంచి మార్పు కోసం పనిచేయాలన్నారు. మహిళలు, బాలికలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ భూత్, సైన్ బోర్డులో కలెక్టర్‌తో పాటు అధికారులు సెల్ఫీ దిగి, సంతకం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ ఎ.మలోల, పీడీ అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు
బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలందరికీ పింఛన్లు పంపిణీ చేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని రేకులకుంట గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్‌మూర్తి, ఎంపీడీఓ సాల్మాన్, సర్పంచ్ నరసమ్మ, ఎంపీపీ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ సదాశివ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


