సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగాయి. అధ్యక్షుడిగా జి.ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా జి.బ్రహ్మానంద, కార్యదర్శిగా ఇ.నాగరాజు, సంయుక్త కార్యదర్శిగా పి.రవితేజ, కోశాధికారిగా కె.దామోదర్‌నాయుడు, కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.శేఖర్‌బాబు, ఎన్.సునీల్‌కుమార్, ఆర్.అయేషాసిద్ధిక్, జి.వన్నూరుస్వామి, డి.ఎర్రిస్వామి, బి.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. అధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులకు పోటీ నెలకొనడంతో ఓటింగ్ నిర్వహించారు. మిగిలిన తొమ్మిది పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోదండపాణి వ్యవహరించారు.
మొరాయిస్తున్న టౖర్బైన్
కూడేరు: పీఏబీఆర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈ నెల 22న తలెత్తిన టర్బైన్ సమస్య కొలిక్కి రాలేదు. ఈ నెల 23 నుంచి అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా.. సమస్య తీరలేదు. దీంతో నిపుణుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి రిజర్వాయర్ అధికారులు తీసుకెళ్లినట్లుగా తెలిసింది.
వృద్ధురాలి బలవన్మరణం
గుంతకల్లు టౌన్: స్థానిక తిలక్‌నగర్‌లో నివాసముంటున్నజి.సుంకన్న భార్య రాములమ్మ(61) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని మెయిన్ రోడ్డులో ఓ లాడ్జి పక్కన సుంకన్న టీ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య రాములమ్మ కొన్నేళ్లుగా డయాబెటిక్, తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. దీనికి తోడు ఇటీవల మూత్ర విసర్జన సమస్య తీవ్రమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన రాములమ్మ... ఆదివారం వేకువజామున బాత్‌రూమ్‌లోకి వెళ్లి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తాగింది. కాసేపటి తర్వాత బాత్‌రూం వద్దకెళ్లిన మనవడు.. అపస్మారక స్థితిలో పడి ఉన్న అవ్వను గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఉదయం 7.30 గంటల సమయంలో ఆమె మృతిచెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ మంజుల తెలిపారు.
ఆటో బోల్తా .. ఒకరి మృతి
కూడేరు: ఆటో బోల్తాపడిన ఘటనలో కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన పర్వతయ్య(57) మృతిచెందాడు. ఆదివారం రాజప్పకు చెందిన ఆటోలో ఉజ్జనయ్యతో కలసి వెళుతుండగా గ్రామ శివారుకు చేరుకోగానే కొర్రకోడుకు చెందిన అమర్నాథ్ ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి ఆటోను ఢీకొన్నాడు. ఘటనలో ఆటో బోల్తాపడింది. కిందపడిన పర్వతయ్య, రాజప్ప, ఉజ్జనయ్య, అమర్నాథ్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి పర్వతయ్య మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముగిసిన రాష్ట్ర స్థాయి
జూడో పోటీలు
ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామంలో రెండు రోజులుగా సాగిన ఎస్‌జీఎఫ్ అండర్–17, 19 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఆదివారం ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో అనంతపురం క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్‌ను దక్కించుకున్నారు. అండర్–19లో బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా క్రీడాకారులు విజయం సాధించారు. తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా క్రీడాకారులు నిలిచారు. విజేతలను అభినందిస్తూ పరిటాల శ్రీరామ్, జనసేన నేత మధుసూదన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఓబిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.
ఉమ్మడి జిల్లా ఉద్యోగుల
ఆటవిడుపు
అనంతపురం కార్పొరేషన్: శ్రీసత్యసాయి జిల్లా పోలీసు, అనంతపురం జిల్లా రెవెన్యూ జట్లు ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడాయి. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో నాగేంద్రప్రసాద్ 31, ప్రభాకర్ 20, ఎస్పీ సతీష్‌కుమార్ 14, డీఎస్పీ మహేష్ 17 పరుగులు చేశారు. అనంతరం బరిలో దిగిన అనంత రెవెన్యూ జట్టు 17.5 ఓవర్ల వద్ద 95 పరులకు కుప్పకూలింది. జట్టులో రవితేజ 17, కలెక్టర్ ఆనంద్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 35 పరుగుల తేడాతో శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి జిల్లా బౌలర్లలో ఎస్పీ సతీష్‌కుమార్ 4 వికెట్లు తీసుకుని ఆల్‌రౌండర్ ప్రతిభను కనబరిచారు.
సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక


