నేటి నుంచి ఆంధ్ర, కర్ణాటక మధ్య టెస్ట్ మ్యాచ్
అనంతపురం కార్పొరేషన్: కూచ్ బెహార్ అండర్ –19 క్రికెట్ ట్రోఫీలో భాగంగా సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఆదివారం ఇరు జట్ల క్రీడాకారులు నెట్స్‌లో ముమ్మర సాధన చేశారు. భారత మాజీ ఆటగాడు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కర్ణాటక జట్టు కెప్టెన్‌గా బరిలో దిగుతున్నాడు.
నేడు పింఛన్ల పంపిణీ
అనంతపురం టౌన్: సామాజిక భద్రతా పింఛన్లను సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీ అంశంపై సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేయాలని సూచించారు. ఈ ప్రక్రియను ఎంపీడీఓలు, డీఎల్‌డీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
అమ్మాజీ ఆలయంలోకి ఎలుగు బంటి
రొళ్ల: మండలంలోని జీరిగేపల్లిలో త్రిశక్తి దేవతలుగా విరాజిల్లుతున్న అమ్మాజీ (మారక్క, గ్యారక్క, ముడుపక్క) ఆలయంలో ఆదివారం వేకువజామున ఎలుగుబంటి ప్రవేశించింది. శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు మారన్న, ముడుపన్న పూజాదికాలు ముగించుకున్న అనంతరం గర్భగుడికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆదివారం వేకువజామున ఆలయంలోకి ఎలుగుబంటి చొరబడి గర్భగుడి తలుపులు తాకి వెళ్లింది. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న అర్చకులు విషయాన్ని గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి.
నేటి నుంచి ఆంధ్ర, కర్ణాటక మధ్య టెస్ట్ మ్యాచ్


