అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
● సంక్షేమ వసతి గృహాల్లో ఏఐ యాప్ వినియోగంపై
అనేక సందేహాలు
అనంతపురం సిటీ: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలను గుర్తించేందుకు అమలు చేసిన హాస్టల్ పర్మినెంట్ ట్రాకింగ్ సిస్టం(హెచ్‌పీటీఎస్) యాప్ ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసతి గృహాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. హాస్టళ్లలో కింది స్థాయి సిబ్బందికి అన్ని బాధ్యతలు అప్పగించి వార్డెన్లు వచ్చిపోయే అతిథులుగా మారిపోయారు. దీంతో సిబ్బంది అనేక అక్రమాలకు తెరలేపినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ యాప్ తీసుకువచ్చారు. జిల్లా వ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి 55 వసతి గృహాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండగా, ఇందులో 7,700 మంది విద్యార్థులు ఉంటున్నారు. 50 ఎస్సీ హాస్టళ్లలో 5,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటన్నింటిలోనూ గత నెల 18 నుంచి యాప్‌ను అమలుల్లోకి తీసుకువచ్చారు.
వార్డెన్లకు అవగాహన కల్పించాం
ఏఐ యాప్‌తో హాస్టళ్లలో అక్రమాలను ఎక్కడికక్కడ గుర్తించి వాటిని సరిదిద్దేందుకు అవకాశం ఉంది. హాస్టళ్లలో రోజు వారీ చేసే పనుల ఫొటోలు ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనాలు, చిరుతిళ్లు, వసతి గృహ ప్రాంగణం, గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారా లేదా అని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుంటుంది. లోపాలు, నిర్లక్ష్యం ఉన్నట్లు తెలిసిన వెంటనే చర్యలు తప్పవు.
– కుష్బూ కొఠారి, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, అనంతపురం
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?


