28,768 | - | Sakshi
Sakshi News home page

28,768

Nov 30 2025 7:14 AM | Updated on Nov 30 2025 7:14 AM

28,768

28,768

ఉమ్మడి జిల్లాలో గణాంకాలు
మందులు తీసుకున్న వారి సంఖ్య
16,414

ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న హెచ్‌ఐవీ

నియంత్రణలో ఆరోగ్య శాఖ వెనుకంజ

రోగుల పట్ల వివక్ష..చికిత్సలకు నిరాకరణ

అనంతపురం మెడికల్‌: హెచ్‌ఐవీ మహమ్మారి నియంత్రణ పట్ల ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాపకింద నీరులా హెచ్‌ఐవీ కేసులు నమోదవడంతో పాటు హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష కొనసాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక హెచ్‌ఐవీ బాధితులకు పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది.

ఆరోగ్యశాఖ బుకాయింపు

ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లలో 2,283 మంది హెచ్‌ఐవీ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఏఆర్‌టీ సెంటర్‌లో గడిచిన రెండేళ్లలోనే 1,400కుపైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా కదిరి, బత్తలపల్లి ఏఆర్‌టీ సెంటర్ల పరిధిలో వేల సంఖ్యలో కేసులు రికార్డయ్యాయి. కానీ ఆరోగ్యశాఖాధికారులు హెచ్‌ఐవీ కేసులను తొక్కిపెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా అనంతపురం, కదిరి, బత్తలపల్లి ఏఆర్‌టీ సెంటర్లలో 28,768 మంది హెచ్‌ఐవీ బాధితులుంటే.. అందులో 16,414 మంది మాత్రమే హెచ్‌ఐవీకి సంబంధించి మందులు వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ వేల సంఖ్యలో హెచ్‌ఐవీ బాధితులు మందులను వాడడం లేదు. ఆరోగ్యశాఖ మాత్రం అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా హెచ్‌ఐవీ మందులు వాడని వారిపై దృష్టిసారించి, వారిని మందులు వాడించేలా చర్యలు తీసుకోవడంలో ఉమ్మడి జిల్లా ఆరోగ్యశాఖాధికారులు విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మందులు క్రమం తప్పకుండా వాడితేనే హెచ్‌ఐవీ పాజిటివ్‌ బాధితుల జీవిత కాలం పెరిగే అవకాశం ఉంది.

511 మంది మృతి

ఆరోగ్యశాఖ నివేదికల ప్రకారం హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారు గత ఐదేళ్లలో 511 మంది మృతి చెందారు. వీరిలో క్రమం తప్పకుండా మందులు వాడని వారు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. 2021–22లో 130, 2022–23లో 155, 2023–24లో 122, 2024–25లో 81, 2025–26కు సంబంధించి ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు.

ఆగని వివక్ష..

● ఈ ఏడాది జూలై 24న ఓ హెచ్‌ఐవీ బాధితురాలికి అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయాల్సి వస్తే వైద్యులు తిరస్కరించారు. చివరకు హెచ్‌ఐవీ బాధితులు విషయాన్ని అప్పటి ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ శివనారాయణ్‌ శర్మకు వినవిస్తే.. ఆయన స్పందించడంతో సర్జరీ చేశారు.

● రాయదుర్గానికి చెందిన ఓ యువకుడు, ధర్మవరానికి చెందిన మరో యువకుడు కాలు సమస్యతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి రాగా ఆర్థో వైద్యులు సర్జరీకి తిరస్కరించి తిరుపతికి వెళ్లండని సిఫార్సు చేశారు. కాగా అక్కడికి వెళ్లాక అనంతపురంలోనే చేస్తారని అక్కడి వైద్యులు సెలవిచ్చారు. చివరకు ఇద్దరు యువకులు రూ.3 లక్షలు వెచ్చించి బెంగళూరులో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

● హెచ్‌ఐవీ బాధితులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదు. జిల్లాలో 18 మంది ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

● ప్రస్తుతం జిల్లాలో ఐదేళ్లుగా 2,366 మందికి మాత్రమే పింఛన్‌ ఇస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది. అర్హులైన వారు ఇంకా వేల సంఖ్యలో పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. హెఐవీతో జీవిస్తున్న వారికి మెరుగైన వైద్య సేవలందిస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది.

ఏఆర్‌టీ సెంటర్ల సంఖ్య

3

గత ఐదేళ్లలో మరణించిన వారి సంఖ్య

511

హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య

పట్టించుకునే వారే లేరు

హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే లేరు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు మాత్రం అధికారులు స్పందించడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిపోయింది. వేల మందికి పింఛన్‌ మంజూరు కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఇచ్చారు. – రామాంజినేయులు,

అనంత నెట్‌వర్క్‌ ఆఫ్‌ పాజిటివ్స్‌

నియంత్రణకు కృషి

హెచ్‌ఐవీ నియంత్రణకు కృషి చేస్తాం. క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. బాధితులకు జరగాల్సిన శస్త్రచికిత్సల జాప్యంపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. హెచ్‌ఐవీ రోగులకు మెరుగైన సేవలందించేలా చూస్తాం.

– డాక్టర్‌ భ్రమరాంబదేవి, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement