ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
గోరంట్ల: కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌లో బోధన, బోధనేతర ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 4లోపు దరఖాస్తు చేస్తుకోవాలని పాలసముద్రంలోని నాసిన్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బట్న కృష్ణారావు కోరారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6,191 ఉద్యోగాలకు సీబీఎస్‌ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవీఎస్ పాటు ఎన్‌వీఎస్‌లో కూడా నియామకాలు చేపడుతున్నాయన్నారు.
ఉసురు తీసిన మద్యం మత్తు
బ్రహ్మసముద్రం : మద్యం మత్తు ఆ యువకుడి ఉసురుతీసింది. ఎరడికెర గ్రామానికి చెందిన బోయ రవి (28), గౌరమ్మ దంపతులు. వీరికి కుమారుడు గౌతమ్‌నంద, కూతుళ్లు విష్ణుప్రియ, బేబీ ఉన్నారు. కూలి పనులకెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. అయితే రవి ఇటీవల మద్యానికి అలవాటుపడ్డాడు. విపరీతంగా తాగేవాడు. ఈ క్రమంలో కూలి పనులకు కూడా వెళ్లడం మానేశాడు. శనివారం ఉదయం పూటుగా మద్యం తాగాడు. తర్వాత ఏమైందో తెలీదు మత్తులోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నీటిలో కొట్టుకొచ్చిన శవం
వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవాసుజల స్రవంతి ఎత్తిపోతల పథకం వద్దకు శనివారం గుర్తుతెలియని శవం కొట్టుకువచ్చింది. అక్కడి సిబ్బంది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగస్వామి తన సిబ్బందితో అక్కడకు చేరుకుని కాలువలో కొట్టుకువచ్చిన శవాన్ని బయటకు తీయించారు. మృతుని వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్‌ఐ పేర్కొన్నారు. చేతిపై పి.సునిత అని పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. గుర్తు పట్టిన వారు వెంటనే 94409 01867, 94407 96856, 94901 08514, 94407 96828 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
విజయలక్ష్మి మృతిపై వీడని మిస్టరీ
గుత్తి: గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన విజయలక్ష్మి మృతి మిస్టరీ వీడలేదు. ఆర్‌ఎస్‌కు చెందిన రామాంజనేయులురెడ్డి భార్య మృతి చెందడంతో విజయలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈమె ఈ నెల 26న ఇంటి నుంచి తోటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి వైటీ చెరువు గ్రామంలోని చెరువులో శవమై తేలింది. ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా అన్నది తెలియడం లేదు. ఆస్తి కోసం మొదటి భార్య పిల్లలే తమ తల్లిని చంపి ఉంటారని విజయలక్ష్మి పిల్లలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు హర్షవర్దన్
ఆత్మకూరు: జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆత్మకూరు క్రీడాకారునికి చోటు లభించింది. మూడు నెలల క్రితం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ఆత్మకూరుకు చెందిన భానుకోట వీర హర్షసాయివర్దన్ సత్తా చాటాడు. దీంతో అతడిని త్వరలో జరిగే సంతోష్ ట్రోఫీ జాతీయస్థాయి ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేస్తూ ఫుట్‌బాల్ అసోసియేషన్ నుంచి శుక్రవారం లేఖ పంపారు. హర్షవర్దన్ చైన్నెలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.
చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ.. : ఆత్మకూరుకు చెందిన భానుకోట వీర హర్షసాయివర్దన్ చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. ముఖ్యంగా ఫుట్‌బాల్ క్రీడలో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చాలాసార్లు ఆడి ప్రతిభ కనబరిచాడు. చదువు, క్రీడలతో పాటు ఖాళీ సమయాల్లో తన తండ్రి భానుకోట బాలపోతన్నకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాడు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షవర్దన్ సంతోషం వ్యక్తం చేశాడు.
హ్యాండ్‌బాల్ పోటీలకు సెలెక్షన్స్ రేపు
అనంతపురం కార్పొరేషన్: ఎల్‌ఆర్‌జీ స్కూల్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు క్రీడాకారుల సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు హ్యాండ్‌బాల్ కార్యదర్శి సాకే శివశంకర్ తెలిపారు.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి


