పంచాయతీ స్థలం కబ్జాకు యత్నం
ఉరవకొండ: ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాలపై కొంతమంది పచ్చనేతల కన్ను పడింది. ఉరవకొండలో గ్రామపంచాయతీ స్థలం ఎక్కడ ఖాళీ ఉందంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. లక్ష్మీనృసింహస్వామి కాలనీలోని సర్వే నంబర్ 604లో రూ.80 లక్షలు విలువ చేసే 30 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 3 సెంట్ల స్థలాన్ని పీర్లచావిడికి పంచాయతీ వారు కేటాయించారు. ఇంకా 27 సెంట్ల స్థలం ప్రజాప్రయోజనాల కోసం అలాగే ఉంచారు. ఈ విలువైన స్థలంపై కొంతమంది టీడీపీ నేతల కన్ను పడింది. రెవెన్యూ అధికారులతో ములాఖత్ అయి 2017లో మంజూరు చేసినట్లు నకలీ పట్టాలు సృష్టించుకున్నారు. ఇందులో టీడీపీ కుటుంబ సభ్యులు, వారి బంధువుల పేరు మీద రెండు సెంట్ల స్థలం మంజూరైనట్లు పట్టాల్లో కనబరిచారు. దీంతో రెండు రోజులుగా సదరు స్థలం వద్దకెళ్లి హద్దులు వేసేందుకు సిద్ధమయ్యారు. గమనించిన కాలనీవాసులు అడ్డగించి.. ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాన్ని మీరెలా ఆక్రమిస్తారంటూ నిలదీశారు. ‘మమ్మల్నే నిలదీస్తారా’ అంటూ అధికార పార్టీ నాయకులు కాలనీవాసులపై దాడికి యత్నించారు. అంతటితో ఆగక వీరే ముందుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమపై కాలనీవాసులు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు టీడీపీ నేతలకు కేటాయించిన పట్టాలపై రెవెన్యూ అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ స్థలంలో కొంతమంది రెవెన్యూ సిబ్బంది కుడా వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద పట్టాలు రాయించుకున్నట్లు విశ్వసనీయసమాచారం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజోపయోగ కార్యాల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే తాము అడ్డుకుని తీరుతామని కాలనీవాసులు స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శి గౌస్‌సాహెబ్ స్పందిస్తూ విచారణ జరిపి పంచాయతీ స్థలం అయితే దాన్ని ఆక్రమణకు గురికాకుండా చూస్తామని తెలిపారు.
ప్రజోపయోగ స్థలానికి నకిలీ పట్టాలు
స్థలంలోకి వెళ్లిన వారిని అడ్డుకున్న ప్రజలు
కాలనీవాసులపై దాడికి యత్నించిన ‘తమ్ముళ్లు’


