ఆట పాటలతో ఆత్మస్థైర్యం
● అట్టహాసంగా విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు
అనంతపురం కార్పొరేషన్: ఆటపాటల ద్వారా విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యం నింపొచ్చని కలెక్టర్ ఆనంద్ అన్నారు. డిసెంబర్ మూడో తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) మైదానంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఇలాంటి పోటీల వల్ల విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికి తీయడమే గాక వారిలో ఆత్మస్థైర్యం నింపొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాల్లోనూ వీరికి రావాల్సిన రిజర్వేషన్ తప్పక పాటించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం ర్యాంప్స్, లిఫ్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ప్రతి ఒక్కరూ యూడీఐడీ కార్డును కలిగి ఉండాలని సూచించారు. అనంతరం రన్నింగ్ 100 మీటర్లు, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, లాంగ్ జంప్, సాఫ్ట్‌బాల్ ఆటల పోటీలు నిర్వహించగా, 500 మంది విభిన్నప్రతిభాంతులైన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా నిరూపించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపుటి నారాయణస్వామి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు అర్చన, బీసీ సంక్షేమ శాఖల డీడీ ఖుష్బూ కొఠారి, డీఎస్‌డీఓ మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.


