క్రికెట్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
● జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీనాథ్, యుగంధర్‌రెడ్డి
అనంతపురం కార్పొరేషన్: జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం ఆర్డీటీ ఆడిటోరియంలో క్రికెట్ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి బీఆర్ ఈశ్వర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సి.శ్రీనాథ్, ఉపాధ్యక్షుడిగా నూర్ మహమ్మద్ ఖాన్, కార్యదర్శిగా యుగంధర్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎన్ సర్దార్, కోశాధికారిగా జె.మురళీకృష్ణ, కౌన్సిలర్‌గా హెచ్ అన్సార్‌ఖాన్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువకుల ప్రతిభ ఆధారంగానే వివిధ జట్లకు ఎంపిక చేస్తామని చెప్పారు. క్రికెట్ సంఘం అభివృద్ధికి పారదర్శంగా పనిచేయాలని క్రికెట్ సంఘం లైఫ్ టైం మెంబర్ మాంఛోఫెర్రర్ సూచించారు. క్రికెట్ అభివృద్ధికి ఆర్డీటీ మైదానం, సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. నూతన సంఘానికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మహిళా క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మచ్చా రామలింగారెడ్డి, క్రికెట్ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నార్పల సత్యనారాయణరెడ్డి, మండల క్రికెట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.


