హెచ్‌ఐవీ నియంత్రణకు పటిష్ట చర్యలు
అనంతపురం మెడికల్: హెచ్‌ఐవీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో హెచ్‌ఐవీ తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ఈ ఏడాదిలో 26,516 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తే అందులో 20 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఇక సాధారణ ప్రజలు 58,501 మందికి పరీక్షలు చేయగా 264 మందికి హెచ్‌ఐవీ నిర్ధారణ అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో హెచ్‌ఐవీని అరికట్టడానికి విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ ఒకటో తేదీన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్‌క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు చేపట్టే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ లైట్ ర్యాలీ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి, ఎయిడ్స్ విభాగం ప్రోగ్రాం మేనేజర్ వెంకటరత్నం, రమణ, డెమో నాగరాజు, ఎస్‌ఈఈఓ త్యాగరాజు, డిప్యూటీ హెచ్‌డీఓ గంగాధర్ పాల్గొన్నారు.


