ఆత్మకూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మకూరుకు చెందిన వివాహిత నందిని (35) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామానికి చెందిన నందినికి 18 ఏళ్ల క్రితం ఆత్మకూరు గ్రామానికి చెందిన నాగేంద్రతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్నపాటి వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల భర్త మద్యానికి బానిస కావడంతో తాగుడు మానేయాలని భార్య పలుమార్లు ప్రాధేయపడింది. అయినా అతనిలో మార్పు రాలేదు. తాగుడు విషయంగానే గురువారం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మృతురాలి తండ్రి బండి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో...
గుత్తి: స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న అసిస్టెంట్ లోకో పైలెట్ రాహుల్ కుమార్ భార్య జ్యోతి(23) ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్ మూడేళ్లగా గుత్తి ఆర్‌ఎస్‌లో నివాసముంటున్నాడు. రెండు రోజుల డ్యూటీకి వెళ్లిన ఆయన శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భార్యను గమనించి ప్రాణముందనే ఆశతో కిందకు దించాడు. అయితే అప్పటికే జ్యోతి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
వివాహిత ఆత్మహత్య


