చంద్రబాబూ.. రైతులపై నిర్లక్ష్యం వీడండి
● మోసం చేస్తే ఉసురు తగలక మానదు
● మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు
బుక్కరాయసముద్రం: సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రమూ సరికాదని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం మండల పరిధిలోని నీలారెడ్డిపల్లి, చెదుల్ల గ్రామాల్లో అరటి, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అతివృష్టి, అనావృష్టితో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన అరటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. అన్నదాతలు అప్పులు పాలవు తున్నా సీఎం చంద్రబాబు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. అరటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పినా ఎక్కడా కొనడం లేదన్నారు. ‘ఢిల్లీవాళ్లతో మాట్లాడాం..అక్కడ మాట్లాడాం,ఇక్కడ మాట్లాడాం’ అంటూ కూటమి నాయకులు ఉత్తుత్తి మాటలు చెబుతున్నారని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులపై భారం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి మరీ ఢిల్లీ మార్కెట్‌కు తరలించి అరటికి గిట్టుబాటు ధర కల్పించారన్నారు. జగన్‌ను చూసి కూటమి నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. కూటమి నాయకులు గాల్లో తిరగడం మానేసి రైతులను సహృదయంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ నిలబడుతుందని, పోరాటాలు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, సర్పంచులు పార్వతి, చెదుల్ల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, రాధా మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మంత్రి అంజినేయులు, చికెన్ నారాయణస్వామి, రమేష్‌రెడ్డి, పట్నం ఫనీంద్ర, నాగ, నాగరాజు, సత్యాలు, జయరామిరెడ్డి, రవి, వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


