గొర్రెల కాపరిపై టీడీపీ నేతల దాడి
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని బోరంపల్లి గ్రామంలో గొర్రెల కాపరి ఆంజనేయులపై రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప (టీడీపీ) సోదరుడు కృష్ణమూర్తి, ప్రస్తుత రాయదుర్గం టీడీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తనయుడు విక్కి అలియాస్ విక్రమ్ దాడి చేశారు. శుక్రవారం ప్రధాన రహదారిపై గొర్రెలను రోడ్డు దాటిస్తున్న సమయంలో అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపుగా కారులో వస్తున్న సదరు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఆ సమయంలో గ్రామస్తులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్షతగాత్రుడిని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు.
అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
అనంతపురం అర్బన్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధిత మీడియా యాజమ్యానం వారి సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో వీలైనంత త్వరగా అందించాలని కమిటీ చైర్మన్ సూచించారు.
సమగ్ర సస్యరక్షణ చర్యలపై చైతన్యపరచండి : జేడీఏ
కళ్యాణదుర్గం: పంటల సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్య రక్షణ చర్యలపై రైతులను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ ఎం.విజయశంకర్‌బాబు అధ్యక్షతన కళ్యాణదుర్గంలోని కేవీకేలో శుక్రవారం వివిధ డివిజన్ల ఏడీఏలు, సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లా ఉద్యాన అధికారి రమాదేవి, ఏడీహెచ్ ఆర్.దేవానంద్, స్థానిక కేవీకే కో ఆర్డినేటర్ చెండ్రాయుడు, ఆత్మా పీడీ పద్మలత తదితరులు పాల్గొన్నారు.
7న ‘ఎన్‌ఎంఎంఎస్’ పరీక్ష
అనంతపురం సిటీ: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షను డిసెంబర్ 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్‌బాబు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుదారులు www.bse. ap.gov.inల వెబ్‌సైట్, లేదా ‘మన మిత్ర’ వాట్సాప్ నుంచి, పాఠశాల యూడైస్ లాగిన్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సవరణలు ఉంటే పాఠశాల హెచ్‌ఎం ధ్రువీకరణ లేఖతో పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్‌ను కలిసి నామినల్ రోల్‌లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
డిసెంబర్ 6 వరకూ ఫీజు చెల్లింపునకు అవకాశం
అనంతపురం సిటీ: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. పదో తరగతికి సంబంధించి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 6వ తేదీలోపు ఫీజు చెల్లించొచ్చన్నారు. bse.ap.gov.in వెబ్‌సైట్‌లో పాఠశాల లాగిన్ అయి అప్లికేషన్ అప్‌లోడ్ చేసి, రుసుము చెల్లించాలని సూచించారు.


