అరటి రైతు నష్టపోకుండా చూడండి
అనంతపురం అర్బన్: ‘‘అరటి రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ధర తగ్గకుండా చర్యలు తీసుకోండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఉద్యానాధికారి డి.ఉమాదేవితో కలిసి అరటి వ్యాపారులు, ఎగుమతిదారులు, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అరటిపంట నాణ్యత పెంచడం ద్వారా ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీపై ఉద్యానశాఖ ద్వారా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు రావాలన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
విధుల్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ శుక్రవారం రెవెన్యూభవన్‌లో ఐసీడీఎస్ పీడీ అరుణకుమారితో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 37 అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, 81 సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సప్లిమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రాం కింద కోడిగుడ్లు సకాలంలో సరఫరా చేయాలన్నారు. తక్కువ బరువున్న పిల్లలను ఎన్‌ఆర్‌సీలో చేర్పించాలని చెప్పారు. ఐదేళ్లలోపు వారికి సంబంధించి తీవ్రంగా కుంగిపోయిన పిల్లలు ఆగస్టులో 4,650 మంది, సెప్టెంబరులో 4,934 మంది, అక్టోబరులో 2,531 మంది ఉన్నారన్నారు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రీ స్కూల్ పిల్లలందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.


