కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు
అనంతపురం: జాతీయ లోక్ అదాలత్‌లో అధికంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు పేర్కొన్నారు. జిల్లా కోర్టులో గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ ఉంటుందన్నారు. రాజీ కాదగిన క్రిమినల్, ఎకై ్సజ్ కేసులతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించే దిశగా చొరవ చూపాలన్నారు. సమావేశంలో మొదటి అడిషనల్ జిల్లా జడ్జి సత్యవాణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: నైరుతి బంగాళా ఖాతంలో వాయుగుండం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రాగల మూడు రోజులు వర్షాలు పడొచ్చన్నారు. అక్కడక్కడా 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపారు.
వీఆర్‌కు యాడికి సీఐ ఈరన్న
యాడికి: మండలంలోని అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ ఈరన్నను వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ ఈరన్న యాడికిలో విధులు నిర్వహించిన 16 నెలల వ్యవధిలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు పంపడం గమనార్హం. పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్యను యాడికి అప్‌గ్రేడ్ సీఐగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐ ఈరన్న ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్‌లో ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించిన మరో ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
డిగ్రీ నూతన
సిలబస్‌కు ఆమోదం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కోర్సులకు సంబంధించి నూతన సిలబస్‌ను ఆమోదించారు. గురువారం వర్సిటీలో ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత ఆధ్వర్యంలో సీడీసీ డీన్ ప్రొఫెసర్ కే. రాంగోపాల్ అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన సిలబస్‌ను ఎస్కేయూలో అమలు చేయడానికి వీలుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఆమోదం తెలిపారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా కళాశాల– పరిశ్రమకు అనుసంధానం చేసేలా సిలబస్ రూపకల్పన జరిగినట్లు వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మునినారాయణప్ప, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
స్తంభించిన పీఏబీఆర్
కుడి కాలువ గేట్లు
కూడేరు: పీఏబీఆర్ వద్ద ధర్మవరం కుడి కాలువ గేట్లు స్తంభించి పోయాయి. దీంతో కుడి కాలువకు నీటి విడుదల మళ్లీ వాయిదా పడింది. గేట్లు ఎత్తేందుకు అధికారులు మోటర్ ఆన్ చేయగానే రోప్ ఇనుప తాళ్లు కూడా తెగిపోతుండడం గమనార్హం. ఈ క్రమంలో గురువారం విజయవాడకు చెందిన అధికార బృందం కుడి కాలువ గేట్లు పరిశీలించింది. ఏళ్ల క్రితం అమర్చిన గేట్లు కావడంతో స్తంభించిపోయినట్లు గుర్తించారు. విజయవాడ నుంచి నిపుణులను పంపి మరమ్మతులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో రిజర్వాయర్ భద్రత దృష్ట్యా గురువారం రాత్రి 4వ గేటును ఎత్తి మిడ్ పెన్నార్ డ్యాంకు నీటిని విడుదల చేశారు. 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్‌ఈ సుధాకర్ రావు తెలిపారు. డ్యాంలోకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 660 క్యూసెక్కులు, హెచ్చెల్సీ ద్వారా 40 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని వివరించారు.
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి


